﻿ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర
టీటీఎస్ ఆడియో నిర్మాణ పాఠ్యం
భాగం ఏడు — మొత్తం ఎనిమిది భాగాలలో


ఇరువదవ ప్రకరణము  ఒడిశా మార్గము మరియు బాలేశ్వరము

యీ దేశపువాడికె వొకసారి వండుకున్నకుండ రెఒడోసారికి పనికిరాదు గనుకనున్ను కుండలు నయముగకనున్ను ముసాఫరులు అందరు కుండలుకొని వండుకొని దిగిన తావులలో ఆకుండలు పగల కొట్టిపోతారు. దిగుడు మజిలోలో కుండ పెంకుల వల్ల అసహ్యము మాత్రము ఒకటి కలిగియున్నది. యిల్లుకట్టి అంగటివాండ్లు జలవసతికి కూడా పూరాగాచేసి యుంచుతారు. యీవూళ్ళోనుంచి రాణీ సరాయిదాకా సడక్కు లేనందుననున్ను సడక్కు తిన్నగా యీవూరి నుంచి మేదినిపూరునకు వేశియుండుటందుననున్ను నా రెండుబండ్లను మేదినివూరుకుండా రాణీసరాయికి రమ్మని సాగనంపించి యీవూళ్ళో యీరాత్రి వసించినాను.

తేదీ ఉదయాత్పూర్వము మూడు సగం గంటలకు లేచి యిక్కడికి యేడు కొసుల దూరములో వుండే భద్రకాళి అనే వూరు పన్నెండు గంటలకు ప్రవేశించినాను. దారి సడక్కులేదు. పొలములమీద నడిచి రావలసినది. ప్రతిదినమున్ను నేను బయలుదేరిన దినము మొదలుగా కలకత్తాలో కలిగియున్న గ్రీష్మము లేకుండా తెల్లవారి మబ్బువేసి మజిలీ దిగినవెనక వర్షము కురియుచూ వచ్చినది. గనుక దారి బహు అడుసుగావుండినది. యీవూరున్ను గొప్పదేను. భద్రకాళి అనే దేవి గుడివున్నది. దిగడమునకు విశాలమయిన యిండ్లుకట్టి వసతికి గుంటలు తొవ్వించి యున్నారు. మొసాఫరులు దిగడానకు ఈ అంగడివాండ్లు అంగడికి చేరినట్టు ప్రత్యేకముగా కట్టివుంచే యిండ్లు విడవలిపూరికలవి అయినా బహు రమణీయముగా ప్రతిదినమున్ను శుద్ధిచేసి వుంచుతారు. యిక్కడ సమస్తమైన పదార్ధములు దొరికినవి.

వ తేది వుదయాత్పూర్వము నాలుగు గంటలకు లేచి యిక్కడికి యెనిమిదికోసుల దూరములోనుండే రాణీసరాయి ప్రవేశించినాను. ఈజాగాలో వూరులేదు. ముప్పై అంగళ్ళు సడక్కుకు యిరుపక్కలా కట్టివున్నవి. దిగడానకు విశాలమయిన యిండ్లుకట్తి వాటికి చేరినట్టుగానే రమణీయమైన గుంటతొవ్వించినారు. చౌకీదారులు మాత్రము వున్నారు గాని పోలీసు బంట్రౌతులు యిచ్చట వుండడములేదు. దారిలో నారాయణగడయని వొకవూరు వున్నది. అక్కడ పూర్వరాజులు నియమముచేసిన సదావృత్తి సత్రాన్ని అద్యాపి కంపెనీవారు నడిపిస్తూవున్నారు. యిక్కడ సకల పదార్ధములు కూరగాయల సమేతముగా దొరికినవి. ఈదేశములో పాలు పెరుగు సహజముగా దొరుకుచున్నవి. దిగిన మజిలీలలోవుండే చౌకీదార్లను నలుగురేశిమందిని రాత్రిళ్ళు నాబంట్రౌతులతో కూడా పారాయిచ్చేటట్టు చేసి వుదయాన సాగివచ్చేటప్పుడు నాలుగేశిఅణాలు యిస్తూ వచ్చుచున్నాను. యీ దినము దారి కొంతమేర సడక్కువేశి యున్నది.

తేది ఉదయాత్పూర్వము రెండు సగం గంటలకు లేచి యిక్కడికి తొమ్మిది కోసుల దూరములో నుండే జేలేశ్వరం పట్టణం అనే వూరు ఒకటి పాయింట్ మూడు గంటలకు ప్రవేశించినాను. దారిసడక్కువేసి వారధులు కట్టివున్నవి. యిరుపక్కలావుండే భూమికన్నా మనిషి పొడుగుమిట్టతో సడక్కువేసియున్నారు. సడక్కునిమిత్తమై కాలువగా మట్టి యెత్తినారు గనుక ఆ కాలువలో నీళ్ళు నిచిచినప్పుడు వొంటికొయ్య దోనెలమీద కావలసిన సామానులు వుంచి యీడ్చుకొని వస్తూవుంటారు. ఈ వూరు సువర్ణ అనే నదీతీరము. గొప్పవూరు. బాజారువీధి వున్నది. ముసాఫరులు దిగడానకు యిండ్లు సమేతముగా యేర్పడివున్నవి. సమస్తమయిన పదార్ధాలు దొరికినవి.

తేది వుదయాత్పూర్వము మూడు సగం గంటలకు లేచి యిక్కడికి అయిదుకోసుల దూరములో నుండే బస్తా అనే వూరు పది గంటలకు చేరినాను. యీవూరు చిన్నదైనా అన్ని పదార్ధాములు అప్రయత్నముగా దొరికినవి. కంపెనీవారు విశాలమైన ధర్మశాలలు రెండుమిద్దెలు కట్తించివున్నారు. నేటిదారిన్ని సడక్కువేసియున్నది. సువర్ణనది కాలువ నడకగా దాటినాము. నదికి యీ పక్క మంకపుచౌకీ వొకటి యున్నది. వొకమాత్రపు వారిని సోదాచూడడమనే సాకుపెట్టి కొంత గుంజుకోకనే ఆ చౌకీదారులు వదలరు. నేటిదారిలో భాటకు కుడిపక్క కొంతదూరములో వొక పర్వతము తెలుస్తూ వచ్చుచున్నది.

కలకత్తాలో నేను వుండగా వొకదినము గాలితోకూడా రాళ్ళ వాన కురిశి గచ్చకాయలంతేశిరాళ్ళు పడ్డవి. ఆరాళ్ళు పది అయిదు యెత్తి వొకపాత్రలోవేశి కుదిలించితే రాళ్ళు రాళ్ళు కుదిలించినట్టు చప్పుడౌతున్నది. కిందపెట్టి బళువైన పదార్థముతో కొట్టితేనీళ్ళయిపోతున్నవి గాని దెబ్బకు తాళనెరవు. చేత పట్టుకుంతే తూటుపొయ్యేపాటి శీతళముగా శుద్దస్ఫటిక నంకాశముగా వున్నది. గడియవుంచితే క్రమక్రమముగా కరిగిపోతున్నవి. మళ్ళీ అటువంటి నాన ప్రసక్తించలేదు. కలకత్తాలో కలిగివున్న పిశాచగాలిన్ని యిక్కడలేదు.

కలకత్తాలో నేను వుండగా మలడీ అనే జ్వరము కలకత్తాలో నంతా ప్రవేశించి నా పరివారములో యివవైమందిని బాధపెట్టినది. గయలో వొక నల్ల డాక్టరు నాకు చెప్పిన ప్రకారము హిందూస్థాని భాషలో చిరటా అనిన్ని యింగిలీషులో బిట్టరు అనిన్ని చెప్పేమూలిక వేశి కషాయముపెట్టి యిలిక్కిసియా విత్రిల్ అనే ద్రావకము వొక క్వార్టర్ బాటిల్ కషాయానకు రెండు తేగరిటెలు పోశి సాయంప్రాత, రెండేసి తులాలు యిస్తూ వచ్చినంతలో ఈశ్వర కటాక్షముచేత అందరికిన్ని అనాయాసముగా వాశి అయినది. వొక బోయివాడికి నీరుకు బదులు నెత్తురు దిగుతూ వచ్చినంతలో బొందెగడ్డ రసము తీసి తవ్వెడు రసములో మూడు బొట్లు గంధకద్రావకము పోశి యిచ్చినాను. త్వరలో వాశి అయినది.

తేది వుదయాత్పూర్వము రెండు సగం గంటలకు లేచి యిక్కడికి ఏడు కోసుల దూరములో వుండే బాలేశ్వరమనే కసుబాబస్తీ తొమ్మిది గంటలకు చేరినాను. దారి యీవరకు వున్నట్టు సడక్కు యేర్పడి వుండడములో భూమి యిసుక కలిసిన రేగడ గనుక బహు గట్టిపడి వర్షము కురిశివున్నా కాలికి అంటుకోకుండా వున్నది.

కలకత్తా మొదలుగా సువర్ణనది వరకు భూమి జిగట రేగడి, అందువల్ల కలకత్తాలో కోశే యిటికెరాళ్ళు బహుగట్టిగా రెందుమూళ్ళ చచ్చౌకముగా కొయ్యగల పాటివైపు కలిగివున్నవి. కలకత్తా యిటికె రాళ్ళు యినుప చిట్టముతో సమమైన బలము కలవని చెప్పవచ్చును. కలకత్తా సున్నము మాత్రము ధావశ్యము చాలదు గనుక యింటి గోడలు చెన్నపట్టణము వలె నీడలు తేరడము లేదు.

దేశాస్థులందురున్ను గుల్లసున్నము వేసుకొంటారు. యీ విషయాన్ని గురించి ఒక దినము బంగాళీవారు మీ దేశములో బ్రాహ్మణులు మత్స్యభక్షణ చేయడములేదంటిరే, గుల్లసున్నము తాంబూలచర్వణముతో తినడములేదా అని అడిగెను. నా అనుభవద్వారా కావేరి మొదలు కన్యాకుమారి వరకు సమస్త బ్రాహ్మణులున్ను దేశాచారప్రకారము గుల్లసున్నము వేసుకుంటారని తెలిసి నేను ఆ దేశ సంచారము చేసినప్పుడు వారితోటిపాటుగా అదే సున్నము వేసుకొనివున్నా బంగాళీవాడుచేసిన ప్రశ్నమహిమను యోచించి మా చెన్నపట్టణములో గుల్లసున్నము వేసుకోవడము లేదని వుపాయముగా వుత్తర్వు చెప్పినాను గాని నా మనస్సుమాత్రము కలతబడి వున్నది. గుల్ల లున్నూ జలజంతువుల కళేబరాలతో చేరినది నిజమేకదా! యీ దేశస్థులు మత్స్యకళేబరాలను పచనముచేసి తింటే దక్షిణదెశస్థులు వాటి దేహాలమీది చిప్పలను కాల్చి తింటారు. ఈ రీతిగా పరోక్ష ప్రత్యక్షాలుగా జలజంతువుల కళేబరాలను వొక పక్కది వొక దేశస్థులు వొకవిధమయిన పచన ద్వారా భక్షణ చేస్తే మరివక దేశస్థులు మొరివొకపక్క కళేబరాన్ని మరివొక విధమయిన పచనముతొ భక్షణ చేయుచూ సమమైన పాపులయివున్నా వొకరిని వొకరు నిమిత్తము మాలి నిందింపుచూ వుంటారు. యీసరికి నావద్ద ప్రయాగనుంచి తెచ్చిన రాతిసున్నము వున్నది. యిది ఖర్చు అయిన వనక బంగాళి వాడివల్ల ధర్మసూక్ష్మము యెచ్చరించబడ్డా యుక రాతిసున్నము దొరకక పోతే దేశాచారాన్ని లోగడివలెనే అనుసరించవలసి వస్తున్నది.

మూటశోధన నిర్బంధము లోకులకు కలిగి యున్నది.

వ తేది వుదయాత్పూర్వము ఒకటి సగం గంటలకు లేచి యిక్కడికి తొమ్మిది కోసుల దూరములో వుండే సూరంగు అనే వూరు ఏడు గంటలకు చేరినాను. నామూడు సవారీలలో రెండు సవారీలకు యిరువై యింటికి వోఢ్రబోయీలను పెట్టవలసి వచ్చినందునన్ను వారు యిరువురి మోతతో వారి వారి అడుగులను యివతలవారి అడుగులతో కలుపుకోకుండా మెల్లిగా నడిచేవారు గనుకనున్ను యెండగొట్టుకు యెంతమాత్రము సహించలేదు గనుకనున్ను రాత్రిళ్ళు యింతప్రొద్ధువుండగా లేచి నడవ వలసివున్నది. దారి నిన్నటివలెనే సడక్కుచేసి యున్నది. యిసక కలిసిన రేగడ. బాలేశ్వరము మొదలుగా కుడిపక్క రెండు గడియల దూరములో సముద్రములో కలియవచ్చిన వింధ్యపర్వత సంబంధమైన పర్వతములు వుండి వున్నవి. నేటిదారిలో బాలేశ్వరానకు కొశెడు దూరములో వక సుంకపు పెరిమెట్టు చౌకీ వున్నది. యిక్కడి కలకటరు మేజెస్ట్రేటు అయిన రికెట్టుదొర వొక చప్పరాశి బంట్రౌతును తయినాతిగా యిచ్చినందున తలషీ అనే శోధన చిక్కులేకుండా సాగి వచ్చినాను. అయినప్పటికి నా గొప్ప కాపాడుకునే నిమిత్తము చౌకీ ఒకటి కి ర్పు రెండు వంతున యినాము యిస్తూవచ్చినాను. ఠాణా సరిహద్ధు ప్రకారము వొక బరక్రదాసు అనే పోలీసు బంట్రౌతు వస్తూ వచ్చినాడు గనుక యివతలి సరిహద్ధు పోచాయించి, చేర్చి, బంట్రౌతు సాగి పొయ్యేటప్పుడు అరదూపాయిలు యినాము యిస్తూవచ్చినాను.

యీ భూమిని వరిపయిరు యెక్కువ. యీ వుత్కలదేశములో వసించే వొఢ్రబ్రాంహ్మణ పండితులు గౌడదేశస్థులకన్నా సంస్కృత భాషను బాగా వుచ్చరించుతారు యీ దేశస్థులకు తెనుగుమాట వొకటి అర వచ్చును. చెన్నపట్టణమంటే తెలియదు. మదిరాసు అనవలసినది.

కలకత్తావద్ద భాగీరధీంది వదిలిన వెనక గంగలో కొట్టుకునివచ్చే కళేబరాలను తినే నిమిత్తము యీశ్వరుడు గంగకు యిరుపక్కలా సృజన చేసిన వింత ఆకృతిగల బోరుగద్ధలను చూడలేదు. ఆగద్దలు రెండు పూర్వ మహంపూర్వ మని యెదురుగా వచ్చినారు. వారు వోఢ్రబ్రాహ్మలు, వుత్కలు లనిన్ని చెప్పుతారు. యిక్కడ శేరు ఒకటి కి ఇరవై రూపాయల యెత్తు, కలకత్తా శికారూపాయలకు చెన్నపట్టణపు రూపాయలకు నూటికి పది వ్యత్యాసము వున్నది. చెన్నపట్టణములో తగ్గిన దినుసని తెలియవలసినది. బంగాళా సీమలోనుండే బోయీలు యీరీతిన బళువు యెత్తలేని జన్ను మోతగాండ్లుగా వున్నారే, మన దేశానకువచ్చే బంగళా పల్లకీలు బహు బళువుగా వుంటున్నవే, వీటి నిమిత్తమే మని విచారించగా బంగాళాలొవుండే యింగిలీషుదొరల కేమి? హిందువులకేమి పాలకీలుయెక్కే షోకేలేదు. పని గడవడానకు కూలిపల్లకీలు అప్పటప్పటికి వుంచుకుంటారు. ఆకూలివల్ల కీలు తేలికగానె వుంచున్నవి. అక్కడ నెల పొడుగు పల్లకీలు మాత్రము చేసి వుంచివున్నవి. వాట్లను హిందూస్తాన్ చెన్నపట్టణము మొదలయిన దేశాంతరాలకు పంపించడానకు తయారయినట్టుగా తోచబడుచున్నది.

తేది వుదయాత్పూర్వము నాలుగు గంటలకు లేచి యిక్కడికి రెండు కోసుల దూరములో నుండే వైతరణీనదీతీరపు వూళ్ళయిన ఆకులాపదా, మూడియాపాడు అనే వూళ్ళు పదకొండు గంటలకు చేరినాను. యీనది వర్షాలు కురిశినందున వడవలకుండా దాటడమయినది. యీ దినము నడిచినభూమి శుద్ధరేగడ, మన్ను వర్షము కురిశినందున అమితముగా కాళ్ళకు అంటుకుంచూ వచ్చినది.

యిక్కడికి జాజీపురమని పేరుకలిగిన నాభిగయ మూడుకోసుల దూరములోవున్నది. అక్కడ యీ వైతరణీ నదీతీరమందు దేహానంతరము జీవుడు వైతరణీనది దాటే కష్ణము పొందకుండా వుండేకొరకు వైతరణీ ప్రయుక్తముగా వొక గొదానముచేసి నాభి ఆకారముగా వుండే వొక కూపములో పిండప్రదానము చేయవలసినది. వుత్కల బ్ర్రాహ్మలు వంద నలభై యిండ్లవారు నాభి గయావళీలని పేరు వుంచుకొని యాచించి జీవనముచేస్తారు. వీరు మత్స్యభుక్కులు కామనిచెప్పినా గయామహాక్షేత్రములో గయావళీలకు బ్రాహ్మణార్ధము చెప్పినట్తు దక్షినదేశస్థులు వీరిని చెప్పడములేదు. ప్రత్యక్షముగా అన్నశ్రాద్ధము చేస్తే స్వదేశాస్థులు దొరికితే బ్రాహ్మణార్ధము చెప్పుతారు. లేని వుగా యెక్కి పడవలమీద వుందవచ్చును. ఈ రెండునదుల పేర్లు కరుసా అనిన్ని బ్రాహ్మణి అనిన్ని చెప్పుతారు. బ్రాహ్మణినది గోపాలపూరుకు వోరగా వున్నది. యీవూళ్ళోను ధర్మశాలలు రెండు వందలు అడుగుల నిడువు పదిహేను అడుగుల వెడల్పుతో నొక కూటమున్ను ఆరడుగుల వెడల్పుతో నొక తాళువారమున్నూ వేశి రెండుకొనలలో రెండు కొట్టిడీలు కట్టివున్నవి. ఇటువంటి ధర్మశాలలు రెండేశి వొక్కోక్క వూళ్ళో యెదురెదురుగా మధ్యే నాలుగు వందలు అడుగుల బయలు విడిచి రమణీయముగా కట్టివున్నవి. మధ్యేవుండే బయిలులో వొక బావి తొవ్వించివున్నారు. యీధర్మశాలలు కంపెనీవారు కట్టించి మూడుసంవత్సరములు అయినవి. ప్రతి ధర్మశాలలోను వొక పోలీసు బంట్రౌతును యిద్దరేశి ఝూడుమాలీలను వుంచినారు. యీదినము దిగిన ధర్మశాలకు చేరినట్టుగా సమీపములో వున్నవి. యీవూళ్ళో సమస్తమైన పదార్ధాలు దొరికినవి.

తేది వుదయాత్పూర్వము మూడు గంటలకు లేచి యిక్కడికి ఏడు కోసుల దూరములో నుండే చత్తియా అనే వూరు పది గంటలకు చేరినాను. దారి సడక్కువేసివున్నా వర్షము కురిసి యెండివున్నందున మనుష్యులను నడవనియ్యకుండా మట్టిగడ్డలు కాళ్ళకు నిండాగా గుచ్చుకుంటూ వచ్చినవి. యిక్కడి బోయీలను బేరాలని చెప్పవలెను. వారందరు గోపాలకజాతి అని తెలియవచ్చినది. మనదేశపు వుప్పాడ బోయీలు వారు మోశే దండే మీద చెయివేస్తే మాజాతి మణిగిపోయనని బహు రచ్చచెస్తారు, వీరు స్నానము మొదలయిన ఆచారముకలిగి బ్రాహ్మణులకు యిక్కడి దేవతలకున్ను వుదకము పాకానికి తెచ్చి యిచ్చి నిండా వుపచారము చేయును అర్హులుగా తుళసీమణి ధారణ చేసి మాంసభక్షణ వదిలి నియమముగా వుంటారు. యీవుత్కలదేశములో అమితమైన పొగచుట్టలు తాగుతారు గాని హుక్కాల ప్రసక్తిలేదు. నేడిదారి కుడిపక్క కనుపడుతూ వచ్చే కొందలకు అడివికిన్ని సమీపము గనుక పులుల భయముకద్దు. మేముదారివడుస్తూ వుండగా దారిలో వొక అంగడివద్దవుండే కుక్కను పులివచ్చి పట్టుకొనిపోయెనదని గాబరాగా వుండినది. యీ వూరిలో బజారు వీధి వొకటే కలిగివున్నది. దిగడానకు ఇండ్లు నిండా చిన్నవిగా కట్టివున్నవి. నపల్లకీలు నవుకర్లు వుండడానకు నడివీధిలో వొక గుడారము వేసి యిముడ్చుకొని దిగినాను. ధర్మశాలలు యిక ముందర లేవని విన్నాము. యీ వూళ్ళోను కావలసిన పదార్ధాలన్ని దొరికినవి. యీ వూళ్ళో యిద్దరు పోలీసుఠాణా బంట్రౌతులు ఠాణా వుంటారు. ఠాణా యిక్కడికి మూడుకోసుల దూరములో వున్నది.

నాతోకూడావచ్చిన మనుష్యులలో కొందరికి అకస్మాత్తుగా తాళకూడని కడుపునొప్పి తగిలి నూరుబొట్లు స్పిరిటులవండర్ ద్రావకము పోసియిస్తే కుదిరినది. కొంతమందికి నెత్తురుబంకపడుతూ వచ్చినంతలో లాడును ద్రావకము పదిబొట్లు చక్కెరలో పోసియిస్తే కుదిరినది. భేదులు అమితముగా అవుతూ వచ్చివారికి శుద్ధిచేసిన అభిని మందు పూటకు చిన్నదూకయెత్తు యిస్తూ వస్తే కుదిరినది. స్త్రీసంబంధమయిన మేహరోగముమాత్రము వొకమాత్రానికి సాధ్యమయ్యేదిలేదు. వొక కావిటివానికి అతి బలిష్టుడైనా సకృదావృత్తి ఒక స్త్రీ సంభోగము అయినంతలో మేహము మేహవ్రణముకూడా పుట్టి క్రమముగా పాదాలలో నొప్పిపుట్టి నడవ కూడకుండా కలిగి నా చేతనయినంత చికిత్స కలకత్తలో చేయించిన్ని కుదరక నా స్నేహితులవశముగా ఆ మనిషిని కలకత్తలో విడిచిపెట్టి వచ్చినాను.

ఈశ్వరుడు యింతరోగముము సకృదావృత్తిలో పురుషులకుయిచ్చే పాడి దేహధర్మముతొ స్త్రీలను పురుషాకర్షణ చేయుచు వచ్చే టట్టుగా వేడుకతో తిరుగుతూ వుండేటట్టు యెందుకు నియమించినాడో ఆకారణము అతనికే తెలియ వలసినది. అయితే నాకు తోచేది యేమంటే ఆరీతిగా స్త్రీలను వుంచడము వల్ల తన కటాక్షానకు పాత్రులు కాతగ్గ పురుషులకు అడివిలో చరింపుచు నుండే వ్యాఘ్రము మొదలయిన మృగాలను చూచితే యెట్లా భయపడి దూరస్థు లౌదురో తద్వత్తుగా అయ్యే నిమిత్తమని తోచినది. అయితే అతని మాయ దురత్యయము గనుక మోహాన్ని జయించలేకుండా వున్నాము.

యీగౌడ దేశములోనున్ను వుత్కల దేశములోనున్ను చింతపండు మిరపకాయలు విస్తారముగా మన దేశమువలె తినక పోయినా మనదేశస్థుల నిమిత్తము కావలసినవి అంగళ్ళలోపెట్టి వుంచుతారు. యెండు మామిడి వరుగు చింతపండుకు బదులుగా వాడుతారు. మామిడిచెట్లు అమితముగా కలవు. శాలలోకూడా అవేపెట్టి పయిరు చెస్తూవున్నారు. యీ దేశపు బోయీలు మిట్టలు యక్కవలసినప్పుడు హరిబోలో అనే మాటతో కంఠధ్వని వుగ్గళించి చేయుచూ వచ్చుచున్నారు.

తేది ఉదయాత్పూర్వము నాలుగు గంటలకులేచి యిక్కడికి ఏడు కోసుల దూరములో నుండే కటమమనే షహరు పదకొండు గంటలకు చేరినాను. దారి సడక్కువేశి గట్టిపడి వున్నా నిన్నటి దినము అమితమయిన వర్షము కురిశినందున దారినిండా అడుసుగా వుండినది. ఆ కటకముముందు రెండుకోసులు కద్దనంగా సడక్కులోనుంచి నొక కాలువ చీలి మహానదిలో కలిసినది. ఆదారి గులకయిసుక పరగా వుండినది. ఆ మహానది కటకము చుట్టుకొని ప్రవహింపుచున్నది. ఆ నది రెండుకోసుల వెడల్పు కద్దు. యీ నది వింధ్యపరతములో వుత్పత్తి అయి కటకానికి సమీపముగానే సముద్రగామి యయినది. వైతరణినది మొదలుగా కటకము వరకున్ను అతి ఘోరమయిన అడవిగా లోగడ వుండినది. యిప్పుడు కంపెనీవారు కలకత్తాలో వుండే బంగాళీధనికులు కూడా ఆ అడివి కొట్టించి సడక్కు వేయించినారు.

కటకముపూర్వమందు ఢిల్లీ కింద వుండినది. అక్కడిపాధుషా కుటుంబస్థులకు అంత, కలహము కలిగి అరాజక మయిన మీదట నాగపూరు యేలుతూ వున్న షాహురాజు వంశస్థులు యీ నెట్టునవున్న అధికారస్థులను కొట్టి తీసుకున్నారు. పిమ్మట యింగిలీషువారు పునాషహరు స్వాధీనము చేసుకొని క్రమక్రమముగా హిందూస్తాన్ సమగ్రముగా స్వాధీనము చేసూంటూ వచ్చేసమయములో నాగపూరున్నాసాహేబుతో కలహప్రసక్తి అయినది గనుక ఆకలహము ఆకరము చేసుకొని కటకపుజిల్లా స్వాధీన పరుచుకొన్నవారై పిమ్మట నాగపూరు రాజ్యము ఆరాజు సంబధికుని అధీనము చేసినప్పుడు యీ కటకపుజిల్లా ఢిల్లీ పాధుషాది గనుకనున్ను ఆ ఢిలీతక్తుయిప్పట్లో తమచేతికింద వున్నది గనుక అన్యా


ఇరువదియొకటవ ప్రకరణము  కటకము నుండి జగన్నాథ క్షేత్రము

యుముగా మీవారు ఆక్రమించిన కటకపుజిల్లా మీకు యివ్వవలసినది లేదని యింగిలీషువారు నిలుపుకొని యేలుతూ వున్నారు. ఇరవై నాలుగు సంవత్సరములుగా వీరి అధీనములో వుండివున్నది.

కన్యాకుమారి మొదలు కాశ్మీరమునకు సమీపమయిన దేశము వరకు ఉత్తర దక్షిణములున్ను సింధునది మొదలు బ్రహ్మపుత్రినది వరకు తూర్పు పడమర లున్ను యింత అనాయాసముగా యెంతో దూరవాసులయిన క్రీస్తు మతాంతరులకు యీశ్వరుడు స్వాధీనము చేయవలనదేమని మరిమరి యోచించగా నాబుద్ధికి విశేషముగాతొచినది యేమంటే మన పూర్వీకులు చెప్పియుండే అహింసా పరమోధర్మం, స్వర్ణస్తేయం సురాపానం, ఆత్మవత్సర్వ భూరాని యివి మొదలయిన వచనములయొక్క ధర్మములను జగత్తులో అందరున్ను పరిపాలన చేయసాగితే ప్రపంచధర్మము జరగక లోకము కృత్యరహితమై శాంతినిపొందును గనుకనున్ను అటువంటి శాంతి యీశ్వరుని చిద్విలాసానకు వ్యతిరిక్తము గనుకనున్ను అటువంటి ధర్మాలు అందరున్ను జరిపించ నేరరు గనుకనున్ను ప్రపంచముయొక్క మర్యాదప్రకారము కామక్రొధములతో చిద్విలసము నడుస్తూ వుండేటట్టుగానున్ను అటువంటి ముఖ్యధర్మాలు వదలకుండా కొందరు అవస్యముగా లోకములో జరిగించి యీశ్వరుణ్ని తృప్రిపరచి ఈశ్వరకటాక్షము సంపాదించి అటువంటి జగదీశ్వరును యొక్క దుర్లభమయిన కటాక్షము తాము సంపాదించుకునేటట్టుగా తమకు ఆయాచిత జీవనము కలుగచేసి కాపాడుచువచ్చిన ఇతరులక్షేమమును స్వస్తి ప్రజాభ్య, పరిపాలయంతాం అనే వచన ప్రకారము ప్రార్ధింపుచూ వుండేకొరకు బ్రాఃహ్మణ క్షత్రియులు మొదలయిన వర్ణములు నిర్ణయించపడ్డవిగదా? అందులో క్షత్రియులు చేయుచూవచ్చిన క్షాత్రధర్మపురస్సరమయిన రాజ్యపరిపాలన పూజ్యులుగా వున్న బ్రాహ్మణులకు దురభిమాన పురస్సరముగా పూర్వకాలములో సరిపడక ఆగ్రహోదగ్రులై క్షత్రియులను నిర్వంశము చేసినందున రాజ్య పరిపాలనచేయ నేర్చిన సంప్రదాయకులు యీ కర్మభూమిని లేకపోయిరి. కడమ మూడువర్ణములవారు యెంతవారివారి ధర్మములు జరిపింపుచున్నా శిక్షకులు రక్షకులున్ను అయిన క్షత్రియులు లేకపోయి నందున వీరి స్వధర్మములు ధీర్ఘముగా జరిపించు కోలేక వర్ణాశ్రమ సంకరులైనారు.

శాంతిరహితులయిన బ్రాహ్మణులద్వారా యింత సంకరము అయిన వేడుక యీశ్వరుడు చూచి వీరి శిక్షనిమిత్తము బలాత్కారము చేత కర్మశూన్యులని చేయ నేర్పరచిన తామసగుణ ప్రధానులయిన మహమ్మదంత ప్రవిష్ణులను యీ భూమిలో ప్రవేశింపబెట్టి కావలసి నంతమట్టుకు పూర్వపు వాసనప్రకారము కర్మద్వారా జ్ఞానము సంపాదించనలె నని పొరాడుతూ వుండే బ్రాహ్మలను శిక్షించినాడు. పూర్వీకులు చేసిన పాపానికి వారివంశస్థులు యెట్లా శిక్షకు అర్హులయినారని విచారిస్తే మాతాశేశద్ మక్కళ్ క్కొ అనే అన్యయారువచనమే ఆకరము. పిమ్మట యెశ్వరుడు కృపాసముద్రుడు గనుక అనుపూర్వికమైన కర్మభూమి శుద్దముగా కర్మశూన్యమైపోవుననే భయముచేత సత్వగుణప్రధానులై బుద్ధికుశలతచేత యీశ్వర సృష్టి అయిన అనేక బ్రహ్మాండముల గతులను ఉత్తర దక్షిణ ధృవనక్షత్రాల స్థితులనున్ను తెలిపి సాహస ధైర్యములతొ నక్షత్రరూపముగా నుండే బ్రహ్మాండాల వుచ్చములను పట్టి సముద్రము మధ్యేవాడలను నడిపించి యిన్ని బ్రహ్మాండములకు సృష్టికర్తగా వొకడేవున్నాడని నమ్మి యీశ్వరుణ్ని ఆరాధనచేయుచూ వుండే యింగిలీషువారికి తగుపాటి బహుమతిగా ఈ కర్మభూమిని అవలీలగా యిచ్చినాడని తోచినది.

యీశ్వరుడు చిద్విలసార్ధమై ప్రతి చైతన్యానికి భిన్నరూపము భిన్నధ్వని భిన్నతత్పర్యము కలుగచేసి వున్నాడు గనుకనున్ను ప్రకృతి దేహములకు సద్గురుకటాక్షము కలిగేవరమున్ను ఆత్మస్తుతి పరనింద చేసేటంతగా మిక్కిలి ఆనందము వేరే లేదు గనుకనున్ను సాత్విక బుద్ధిగా విచారించితే హిందువులను తమ క్రీస్తుమతానకు యెక్కువ అని వారు అనుకోక పొయినా సరిపోలిన దనియైన అనుకో వచ్చును. దురత్యయమయిన యీశ్వరమాయ అటు సాత్వీకముతో వొకమాత్రముగా యెవరినిన్ని అనుకోనివ్వరు గనుకనున్ను మీది మిక్కిలి హిందువులు పై సంకరద్వారా మత విషయమై బహిరంగకృత్యములలో గర్హితముగా కొన్నికొన్ని ప్రమేయాలయందు నడుచుచున్నారు. గనుక పయిన నార, లోపల చెక్క, అందులోపల మధురమయిన విత్తు, కలిగిన బాదమపండు వతుగా వుండే హిందూమత సారమును తెలుసుకోలేక హిందువులు తెలియక మణిగిపోతారే, మనమతము పట్టితే కడతేరుదురే, అనే పశ్చాత్తాపముతో స్వమత ప్రకటన చేయను యిగిలీషువారు వుద్యోగిస్తూవున్నారు గాని మరి యెటువంటి విషయములోనున్ను హిందువులకు యే విరోధముచేతనైనా తమచేతనయిన మట్టుకు తొందరలేకుండా రాజ్యపరిపాలన చేయుచు ఈశ్వర కటాక్షమునకు దినదినానికి పాత్రులుగా ప్రవర్తింపుచువున్నారు.

యీ కటకపు షహరులో రెండు వేల యిండ్లు కద్దు. పదివేలమంది ప్రజలు వుండవచ్చును. సమస్తమయిన పదార్ధములు దొరుకుచున్నవి. తురకలు ఈ రాజ్యము చేసేటప్పుడు యిక్కడ తురకలు నిండా ప్రవేశించినారు. ఇప్పట్లో మొహరంపండుగ అయినందున యీవూళ్ళో తత్ప్రయుక్తమయిన వుత్సవము జరుగుచున్నది. గాని దక్షిణదేశమువలెనే వుత్సవము జరిగింఛేవారు నామము బొగ్గు మొదలయినది పూసుకొని వెఱ్ఱిచెష్టలు విస్తారము చెయ్యడములేదు.

మహమ్మదు మతస్థులు కాబూలుదేశ ద్వారా హిందుస్తానులో ప్రవేశించిన వెంబడిగానే సింధునదీ తీరమందు వున్న సోమనాధస్వామి గుడి నవరత్నఖచితమైనది వుండగా కొట్టి పాడుచేసి కోట్యంతరాల రత్నాలు స్వాధీన్ముచేసుకొని అక్కడి నివాసులనున్ను పంజాజ అనే అయిదు దారలు కల సింధు నదీ తీరమందు వుండే హిందువులనున్ను సుమారు లక్షమందిదాకా మహమ్మదుమతములో మేము ప్రవేశించమని చెప్పినందుకు వారిని శిరచ్చేదము చేయించినారు. అటుతర్వార ప్రయాగలోవున్న అక్షయవటం యంత్రము మొదలయిన స్థలములను నిర్మూలముచేశినారు. కాశిలో విశ్వేశ్వరుడు అన్నపూర్ణ వగైరా దెవతలను వారి మందిరాలను బ్రహ్మాలయాలను పగలగొట్టినారు. యింత నిర్బంధము మహమ్మదు మతస్థులు జరిగించినప్పడికీన్ని యిప్పువు వుపాయముచేత క్రీస్తుమతస్థులు తమ మతములో చేర్చిన హిందువులలో సహస్రములో వొకపాలైనా ఆ కాలమందు మహమ్మదుమతములో హిందువులు ప్రవేశించక మహమ్మదు మతస్థులను క్రమక్రమశ, తమ మతముజోలికి రాకుండావుండేటట్టు చేసుకొని యిడిసిన దేవాలయాలను బ్రహ్మాలయాలను మళ్ళీ వుద్ధరించుకుంటూ వచ్చినారు. క్రీస్థుమతస్థులు ఉపాయేవతు యచ్చక్యం సతచ్చక్యం పరాక్రమై, అనే వచనప్రకారము క్రమక్రమముగా యీ దేశములో గౌరవము సుతరాంలేకుండా వుండే జాతిని విస్తారముగా తమమతములో చేర్చుకొని కర్మఫలము యొక్క రహస్యము తెలియని వారిని క్రీస్తు మతమే వుత్తమమని చెప్పుకుంటూ వుండేటట్టు యెప్పటికిన్ని చేసి వున్నారు.

మహమ్మదు మతానకు క్రీస్తుమతానకున్ను, హిందూమతానకున్ను, వుండే తారతమ్యములను గురించి నేను ఒకకధ వినడమయినది. అది యేలాగంటే వొక ప్రభువు ఈ మూడుమతస్థులను వద్దవుంచు కొని వొక ప్రశ్నచేసినాడట. ఆ ప్రశ్న, ఏది, అనగా వొక దారిమధ్యే వొకడు భాటసారిని కొట్టి నిర్భంధపెట్టి తన యింటికి పిలుచుకొని వచ్చి ఆతిధ్యము యిచ్చేటట్టు సంకల్పముచేసుకొని యిల్లు కట్టుకొని కాపురము చేయుచూ వచ్చినాడు. మరినొకడు తన యింటియొక్క సౌఖ్యమును తన ఆతిధ్యముయొక్క రుచినిన్నిభోధచేసి దారిన నడిచేవారిని యింటికి పిలుచుకొని వచ్చి ఆతిధ్యము యిస్తూ వచ్చేటట్టు సంకల్పముచేసి వొక యిల్లు కట్టుకుని కాపురము చేయుచువున్నాడు. మరివొకడు తనయింటికి వొకరిని పిలువవలసినది లేదు, నేను వొకరింటికి వొకరివద్దికి పోను, నా అంతట నేనువుండ వలసినదని నిశ్చయము చేసి యిల్లు కట్తుకుని కాపురము చేయుచు వచ్చినాడు. యీముగ్గురిలో యెవడు వుత్తముడని పై ముగ్గురి మతస్థులను ప్రశ్నచేసినంతలో మహమ్మదు మతస్థుడు బోధించి పిలుచుకుని వచ్చేవాణ్నిన్ని తావులో పడివుండే వాణ్నిన్ని నపుంసకులుగా నిందించి ఆతిధ్యము యివ్వవలెనని తోచినప్పుడు వెర్రితనముచేత దారిపొయ్యేవారు రాకపోతే తన్ని ఆదిధ్యము యిచ్చేదే పురుషవాహిని యని ప్రత్యుత్తరము యిచ్చినాడట. క్రీస్తుమతస్థుడు నిర్భంధము చేసేవాణ్ని కౄరుణ్నిగానున్ను వుండేతావులోనుంచి కదలని వాణ్నిస్థావరిరూపుణ్నిగా నిందించి మనసును రంజితపరచి ఆతిధ్యం యిచ్చేవాడు శ్రేష్టుడని ప్రత్యుత్తరవు యిచ్చినాడట. హిందుమతస్థుడు మంచిపదార్ధములున్ను మంచిస్థలమున్ను దొరికినవాడు తనకు అబ్బెగదా అనిన్ని కొత్తవాణ్నిపిలుచుకొని వస్తే తనకు దొరికిన మంచి పదార్ధము భక్షణచేసెవాడికె కొత్తవానికి లేక పదార్ధాన్ని చెరిచి తాను భుజించక ఆ మంచి పదార్ధాన్ని నిందించి పదార్ధము కలవానికి పనికి రాకుండా కొత్తవాడు యెక్కడ చేసిపోనో అనే భయముచేత మంచిపదార్ధము కలవాడు వొకణ్ని చేర్చక వొకని తొను చేరక తనంతట వుండును. వాడు పూర్ణుడున్ను బలవంతముచేసి తన పదార్ధము పెట్టేవాడున్ను బోధించి తన పదార్ధమును పెట్టేవాడున్ను సకాములు వుత్తమ పదార్ధమును కన్నవారు కారు అని పరస్పరమున్ను నిందించివారట.

యిదిన్నిగాక మరివొక ఇతిహాసము విన్నాను. అది యేమంటే వొక యింగిలీషుదొర వొక బ్రాహణ్ని నాదేహమువలెనే నీదేహము రక్తమాంసాది యుక్తములయిన అవయవాదులతో చేసివున్నదే? బ్రాహ్మలు మేము యెక్కువ అని అనుకోవడానకు కారణ మేమని అడిగినంతలో బ్రాహ్మణుడు పుల్లమామిడిపండు తియ్యమామిడి పండున్ను వొక్కదినుసు ఆకులు కొమ్మలుగల చెట్టున వొక ఋతువులో వొకటే విధమయిన తోలు కండముట్టేతో జనించి సమస్త విధాలా వొక్కటేరీతిగా వున్నా రుచిభేదము కావడానకు యేమికారణమో అదేకారణము బ్రాహ్మణుల యెక్కువతనాన కని చెప్పి మరిన్ని బ్రాహ్మలు శ్రేష్టులని యీశ్వరుడు చెప్పినాడంటాము గాని మేమే చెప్పలేదు. యెట్లా అన్ని మామిడిపండ్ల వుత్పత్తి స్థితిలయాలు వొక్కటే క్రమమయినా వాటి భోక్తకు వాటి రుచిభేదము తెలిశి యిది మంచి యిదిచెడు అని వాట్లను వాడినట్లు మీదేహసారానిన్ని బ్రాహ్మణదేహాల సారానిన్ని యెరిగి యీశ్వరుడు తియ్యమామిడిపండు శ్రేష్టమని రుచిచూడగలవాడు చెప్పినట్లు బ్రాహ్మలను శ్రేష్టులని నిరూపించినాడని చెప్పినాడట.

తేదీ మధ్యాహ్నమువరకు కటకములో నిలిచి నాలుగు గంటకు బయలుదేరి యిక్కడికి ఐదు కోసుల దూరములో నుండే గోపాలపూరు అనేవూరు ఎనిమిది గంటలకు చేరినాను. కటకముముందర చుట్టుకొనివుండే మహానదిని పడవలకుండా నొకసారి దాటినాను. లోగడ మామిడిచెట్లు శాలవుండగా వాటిమధ్యే యిప్పుడు సడక్కు వేసి వున్నది. గనుక బహు రమణియ్యముగా వున్నది. గోపాలపూరు గొప్పవూరు. బాజారు వీథి కద్దు. వూరుమధ్యె వొక సరసింహస్వామి గుడి కట్టి లోపలి ఆవరణలో బ్రాహ్మలు దిగడానకు తాళువారము వేశి వెలిపక్క శూద్రులకు తాళువారమువేశి మిద్దెవేశి కట్టివున్నది. గనుక ఆగుళ్ళోనే దిగడమయినది. నరసింహమూర్తిని సుందరముగా చేసి వుంచినారు. యీమత్స్యదేశపు బ్రాహ్మణుడు రెండుకాలాలున్ను పూజచేస్తాడు. దక్షిణదేశపు చట్టముగా గుడి కొంచములో ముఖమంటపము వుంచి కట్టివున్నది. యీవూళ్ళో అన్నిపదార్ధములు దొరికినవి. గోపాలపూరు ముందర రెండు నదులు కాలినడకగా దాటినాను. వాటిపేళ్ళు భార్గవనది వొకటి, కుశనది వొకటి.

తేది వుదయాత్పూర్వము నాలుగు సగం గంటలకు లేచి యిక్కడికి పది కోసుల దూరములో నుండే సత్యవాది యనే వూరు రెండు గంటలకు చేరినాను. దారిలో పిప్పిలి అనే మజిలీ వూరివద్ద మనుష్యులు తడిశేపాటి వర్షము కురిశినది. రేపటిదినము ద్వాదశి గనుకనున్నుజగన్నాధమహాక్షేత్రములో కొంచము బ్రాహ్మణ భోజనము చేయింతామని యత్నముతో యీదినము యింతదూరపు మజిలీ చేయడమయినది. యీవూరున్ను గొప్పది. మహాస్థలము. వొకమఠములో విశాలముగా స్థలమువుండగా దిగినాను. యిక్కడ గోపాల మూర్తి గుడి వున్నది. వజ్రరెఖయనే నది వొకటి చిన్నదిగా గుడికి సమీపముగా ప్రవహిస్తూవున్నది.

ఈ స్థలమాహాత్మ్యము పూర్వకాలములో గోకుల బృందావన నివాసిగావున్న కులీనుడయిన బ్రాహ్మణుడు, ఆసన్న కాలమందు వుపచరిస్తూ వున్నవాడికి తనకన్యకను యిస్తానని వాగ్దత్తము చేసినట్టున్ను, ఆ వృత్తాంతము కన్యాబంధుజనము అబద్ధమని వాదించినంతలో గోకుల బృందావననివాసి యయిన గోపాలమూర్తి పురుషాకృతి ధరించి యిక్కడి రాజుముందర సాక్షి చెప్పి ఆ కులీనుడుకి కులీనుడికన్యను తీసి యిచ్చి వివాహము చేసినట్టున్ను అదునిదలుగా యిక్కడ గోపాలమూర్తి విలశిల్లి అంగుళియ్యముతో గీచి, నదిని కలగచేశి భక్తవత్సలుడుగా వుండేటట్టు వాడుకుంటారు. మత్స్యదేశపు బ్రాహ్మల యిండ్లు యీవూళ్ళో వంద కడపదాకా వున్నవి. యీ మూర్తికి పిష్టపక్వాన్నము నైవేద్యముగాని ప్రత్యక్ష అన్నము నైవేద్యము చేసే వాడికెలేదు.

తేది వుదయాత్పూర్వము నాలుగు గంతలకు లేచి యిక్కడికి అయిదు కోసుల దూరములోనుండే జగన్నాధ మహాక్షేత్రము వుదమయిన రెండు గడియలకు చేరినాను. దారి సడక్కు వేసియున్నది. క్షేత్రానకు కోశెడు దూరములో తులసీదాసు అనే మహాపురుషుడి సమాధి వున్నది. అక్కడ జగన్నాధస్వామి స్థూపీమీదనుండే చక్రదర్శనము అవుతున్నది. అక్కడి స్థలవాసులకు యధోచితము దక్షిణయిచ్చి చక్రదర్శనము చేయవలశినది. అటారానాళాఘాటు కుండా క్షేత్రము ప్రవేశించినాను. ఆఘాటులో యాత్ర్ర వచ్చినవారివద్ద హశ్శీలు పుచ్చుకొనే కచ్చేరి వున్నది. అక్కడ మనుష్యులు గణన చేయించుకొని హాశ్శీలు యిచ్చి చీటీచేయించుకుని స్థలము ప్రవేశించవలసినది.

యీ జదన్నాధ మహాక్షేత్రమాహాత్మ్యము పురాణ సిద్ధముగా యిప్పుడు తెలియడము యేమంటే పూర్వకాలమందు యీ భూమి అతిఘోరమయిన దండకారణ్యముగా వుండినది. అందులో నీలాద్రి అనే పేరుగల పర్వతము వొకటి వున్నది. అందులో నీలమాధవస్వామి అనే మూర్తి నివాసము చేయుచు కిరాతకులవల్ల ఆరాధన చేయబడుతూ వుండినట్తున్ను యిట్లా వుండాగా యిక్కడికి బహు దూరప్రాంతమందున్న యింద్రధ్యుమ్న మహారాజుకు యీమూర్తి ప్రభావము ఈస్థల ప్రభావమున్ను తెలిశి నిశ్చయముగా చూచి విచారించి వచ్చేకొరకు వొక బ్రాహ్మణ్ని పంపించినాడు. పూజ చేయుచున్న కిరాతకులకు నీలమాధవస్వామి తత్పూర్వము నన్ను యెప్పుడు బ్రాహ్మడు వచ్చి దర్శనము చేయుచున్నాడో అప్పుడు మీ అధీనము వదిలిపోతానని చెప్పివుండినాడు. గనుక యింద్రద్ద్యుమ్న మహారాజువల్ల పంపించబడ్డ బ్రాహ్మడు తన్ను బ్రాహ్మణుడని తెలిస్తే కిరాతకులు హింసింతురనే భయముచేత ప్రచ్చన్న వేషుడై యీ దండకారణ్యము ప్రవేశించి స్త్రీలు మాయాశక్తి చైతన్య పరిపూర్ణులై సమస్త కామక్రోధ కలహాలు పురుషులకు కలగచేశేవారు గనుక వచ్చిన బ్రాహ్మణుడు కిరాతక రాజుకొమార్తెను స్వాధీనపరచుకుని కిరాతకులవల్ల అర్చింపబడే నీల మాధవస్వామిని దర్శనముచేసి తన రాజుకు సమాచారము చెప్పను వెళ్ళినాడు. ఇంతలో నీలాద్రిపర్వతమున్ను నీలమాధవస్వామి మూర్తిన్ని సముద్రసైకతమువల్ల అంతర్ధానమైపోయి సముద్రతీరమందుండే చక్రతీర్థమువద్ద బలభద్ర కృష్ణసుభద్రల మూడు కళీబరాలున్ను కొంతమట్టుకు దహనమై కొంతకాలకనిలిచి అవి దారుమొద్దువలెనే ఆకారములు కలిగినవిగా కొట్తుకునివచ్చి పడివుండగా అందులో నీలమాధవస్వామి చైతన్యాంశలు ప్రవేశించివుండింవి. ఆవయినము ముఖ్యకిరాతకులకు తెలిసి ఆ దారుమొద్దులను తెచ్చి మృదంగవతుగా వక్షస్థలములయందు ధరించి వాటిని వాయిస్తూ ఈశ్వరభజన చేయుచూ వచ్చినారు. ఇట్టి సమయమందు యింద్రద్యుమ్నరాజు యీ స్థలము ప్రవేశించి నీలమాధవస్వామి అంతర్ధానమయిన వర్తమానము తెలిసి ఖిన్నుడై బహు తపస్సుచేసి మళ్ళీ నీలమాధవస్వామి ఇక్కడ విలసిల్లుతావని వాకు ఇచ్చినందు మీదట యిప్పుడుదృశ్యముగా వుండే మందిరములు కట్టి మళ్ళీ బహుకాలము తపస్సుచేయుచూ నుండగా యీ మందిరాలు పర రాజు స్వాధీనమై పోయినవి. మళ్ళీయీమందిరలనున్ను కిరాతకుల స్వాధీనముగా వున్న దారువులనున్ను యింద్రద్యుమ్నరాజు సంపాదించిన వెనుక విశ్వకర్మ వృద్ధ స్వరూపముగావచ్చి ఆ దారుమొద్దులను బింబాలు చేస్తూవుండగా విశ్వకర్మ నియమించిన కాలము వరకు మనసు తాళక అతను పనిచేసే ఆలయము తెరిచి చూచినందున సగము మట్టుకైన పనితో ఆ మొద్దులను యథోచితముగా బింబాకృతి చేసి విడిసిపెట్టి విశ్వకర్మ పోయినాడు. తర్వాత ఆరీతిగావుండే బింబాలలోనే మూర్తీభవిస్తానని అశరీరవాక్కుగా యీశ్వరాజ్ఞ అయినందున బ్రహ్మపురస్సరముగా ఆ మూర్తులను యింద్రద్యుమ్న రాజు ఇక్కడ ప్రతిష్ట చేసినాడు. అది మొదలుగా యిక్కడ యీశ్వర చైతన్యము ప్రతిఫలించివున్నది---యిక్కడ ప్రసాదమహిమ యెక్కువ కావడానకు కారణము యేమంటే వైకుంఠములో నుండే శ్రీమహావిష్ణుదర్శనానకు సాంబమూర్తిన్ని బ్రహ్మౌయున్ను వెళ్ళినట్లున్ను అప్పుడు లక్ష్మి బ్రహ్మకు శివునికిన్ని యిచ్చినట్టున్ను వీరుభయులు వుచ్చిష్టమని యెంచక మహాప్రసాదమని భుజించి వీరి స్వస్థలాలకు వచ్చినంతలో వీరుభయుల భార్యలుకున్ను వీరుభయులు కళాహీనులై యున్నట్టు తోచి అందుకు కారణమేమని అడిగినంతలో వీ రుభయులు తాము మహాప్రసాదభక్షణ చేసిన వర్తమానము చెప్పగా ఆ యిద్దరుస్త్రీలు ఆ మహాప్రసాదభక్షణ కళావృద్ధి చేయతగ్గదికాని కళాహీనము చేయనేరదే, మరి యేమి పనిచేసినారో అని చెప్పి ఆ ప్రసారము మాకు యేల తెచ్చి యియ్యక పోతిరి అని అడిగినట్తున్ను వీరుభయులు మీరు స్త్రీలు మాయాస్వరూపులు గనుక మహాప్రసాదానకు అర్హులు కారని మీకు తెచ్ఫి యియ్యలేదని చెప్పి మనము కళాహీనులు కావడానకు కారణ మేమో అడిగి తెలుసుకుందా మని మళ్ళీ విష్ణువద్దికి వచ్చినట్టున్ను విష్ణువు వారికి చెప్పడములో మా ప్రసాదభక్షణవల్ల మీరు కళాపరిపూర్ణులు కావలసినవారైనా ఆ మహాప్రసాదము స్వీకరించడములో ఆ ప్రసాదము మీచేతులకు తగిలి పరంపరగా తక్కువయిన అవయవములలో తాకి ప్రసాదాన కగౌరవము మీవల్ల నడిచినది గనుక తన్నిమిత్తమయిన అపరాధముచేత మీరు కళాహీనులైనారని తెలియచెప్పినట్టున్ను అందుకు ప్రాయశ్చిత్తమేమని అడగగా జగన్నధ మహాక్షేత్రములో వొక పుణ్యతీర్ధము వున్నది, ఆ పుణ్యతీర్ధమందు మీరు స్నానము, పానము మొదలయినవి చేసితి రేని తత్పాపపరిహారమగునని చెప్పినట్తున్ను బ్రహ్మరుద్రులు అట్లా చేసినట్లున్ను తదారభ్య యీ స్థలము వదిలిపొయ్యేటప్పుడు యాత్రకు వచ్చినవారు అందరు ఆ తీర్ధములో ప్రసాదవిషయమయిన అపరాధపరిహారార్ధము స్నానపానములు చేస్తారు. ఆ చొప్పున విష్ణుమహాప్రసాదానకు స్త్రీలు అర్హులుకారని తెలిసిన వెనక పార్వతి సరస్వతులు యిద్దరు ఈ స్థలములో తపస్సుచేసి సర్వసాధారణముగా స్త్రీలకు శూద్రులకు కూడా విష్ణుహాప్రసాదము కలిగేటట్టుగా వరము తీసుమున్నారుగనుక అద్యాపి యిక్కడ ప్రసాదము సర్వసాధానణమై తారతమ్యము లేకుండా పరిగ్రహింపబడుతూ వున్నది.

ఆ చొప్పున తపస్సుచేసి అవసరముగా పార్వతి విమలా అనే పేరు ధరించి యీ గుళ్ళో విలసిల్లి ఆమె సంవత్సరోత్సవములో అద్యాపి తామసపూరాంగ మయిన జీవహింసలు అంగీకరింపుచున్నది. విష్ణుగుళ్ళో ఆవరణము లోపల యీ బలులు జరగడము యుక్తముకాదని కొందరు సాత్వికులు యిటీవల విరోధిస్తే వారిని ఉపద్రవపెట్టి యధాప్రకారము ఆశక్తి బలిపూజలు జరిగించుకుంటూ వున్నది. సరస్వతి రజోగుణ ప్రధానురాలు గనుక యధోచితమైన పూజను అంగీకరిస్తూ యీ గుళ్ళో పార్వతివలెనే విశేషనామధేయములేక విలసిల్లివున్నది. యీగుళ్ళో స్నానము చేసినమాత్రాన విష్ణుసారూప్యము కలగచేయ తగ్గపాటి వొక మహాతీర్ధము వుండినదట. తద్ధ్వారా కాకులు మొదలయిన పక్షులకు విష్ణుసారూప్యము కలుగుతూ వచ్చెనట. ఆతీర్ధము యిప్పుఛు కలిసామ్రాజ్యద్వారా అంతర్ధానమై ఆ ప్రదేశాముయొక్క నిశానిమాత్రము చూపింపుచున్నారు. రజస్యమయిన తాపిని మొదలయిన గ్రంధాలలో పరమాత్మ చతుర్ధాకృతిగా ఇక్కడ దర్శనము యిస్తున్నాడని చెప్పేటట్టు తెలిసినది.

ఇక్కడి గుడి నన్నూరు అడుగుల చచ్చవుకములో సుమారు తిరువట్టూరి గుడిపాటి విశాలముగా రెండు ప్రాకారాలు కలిగివున్నది. గర్భగృహము మీద చక్రము వుంచివున్నది. ముఖమంటపము విశాలముగా పయిన పయిన గుంమటము అందము గల స్థూపీ అరటి పువ్వందముగా రెండుతాటిచెట్లపొడుగున కట్టి మీద చక్రము వుంచివున్నది. ముఖమంటపము విశాలముగా పయిన గుంమటము అందముగల కట్టి వున్నది. ముఖమంటపముయొక్క బయిటి ప్రాకారము గోడలో తురకరాయి మీద చిత్తుళిపని బహుసుందరముగా చేసివున్నారు. గర్భగృహము చుట్టూ చిల్లర గుళ్ళ శానా కట్టివున్నవి. గుడిలోపల వొక అక్షయ వటము వొక ముక్తి మంటపము వున్నది. వాటికింద జపము చేస్తే ముక్తిప్రదమని నియమించివున్నారు. వెలిప్రాకారములో నన్నూరు పొయిలుగల వంటశాల విశాలముగా వొకటి కట్టివున్నది. వొక్కొక్కపొయిమీద పన్నెండు పిడతలు వుంచి అన్నము పచనమయ్యేటట్టు వయిపు, వీలు, చేసివున్నారు. వొక్కొక్కపొయి ఐదు వేల రూపాయలకు కదా చిత్తుగా అమ్మకానికి దొరుకుతున్నది. పచనమయ్యే ప్రసాదములో పొయి గలవానికి వరుమానము విస్తారము. నిత్యము రమారమిని అయిదు గరిశల బియ్యము అన్నము భోగ్యముగా నివేదనము అవుతున్నది. పిడతలు చేసే కుమ్మరవాండ్లు నాలుగు వందలు యిండ్ల వారున్నారు. ప్రసాదస్వీకారము చేయడములో ఉచ్చిష్టదోషము యెంతమాత్రము పాటించక స్వీకారము చేయుచున్నారు. గుడి లోగడ నీలాద్రిపర్వమున్న తావులో కట్టివున్నది గనుక వూరువుండే భూమి కన్నా గర్భగృహము సుమారు నూరడుగుల పొడుగులో కట్టి వున్నట్టు తోచబడుచున్నది.

గుడికి నాలుగు పక్కలా నాలుగు ద్వారాలువున్నవి. అందులో తూర్పుపక్క ద్వారములో ఒక సింహాన్ని చేసివున్నారు. గనుక దాన్ని సింహద్వారమంటారు. అక్కడ సర్కారు మనుష్యులుంటారు. చీటీ చూచుకొని స్వామిదర్శనానికి గుడిలోపల మనుష్యులను యెంచి విడిచి పెట్టుతారు. జేలేశ్వరమువద్దవుండే సువర్ణ రేఖనది మొదలు గంజాం వద్దవుండే ఋషికుల్యానదివరకు వోఢ్ర దేశముగనుక యీ మధ్యేవుండే కాపురస్తులు జగన్నాధానకు వస్తే యెంతమాత్రము హాశ్శీలు యివ్వనక్కరలేకుండా పూర్వమునించి యేర్పాటు అయివున్నది. యితరదేశస్థులు యెవరువచ్చినా నాలుగుదినములు స్వామి దర్శనము చేసి అయిదోదినము భోజనముచేసి పోవడానకు జమను ఒకటి కి ర్పు రెండు రు, రెండు నుంచి ఆరు వరకు-సున్నా, యివ్వవలసినది. యెక్కువ దినాలు స్వామిదర్శనము ఆమేక్షిస్తే ఆలెక్కకు త్రైరాశికము మీద రెట్టించి మహసూలు యిచ్చి చీటి పుచ్చుకోవలేను. మహసూలు తీరువచీట్లు యిచ్చేటప్పుఛు పురోహితము వహించిన పండా మారీఫత్తున వాడి పేరుకూడా దాఖలా వ్రాసుకుని యిస్తారు. క్లుప్తమయిన దినాలకు యెక్కువగా యాత్రవారు వుండి పండా తెలియచేయకపోతే పన్నెండు రూపాయలు జులుమానా పుచ్చుకుంటారు. గనుక పండావాండ్లు క్లుప్త దినాలకు యెక్కువ వొక గడియ అయినా యాత్రవాండ్లను వుండనీయకుండాకూడా ఘాటీవరకువచ్చి సాగనంపించి లోగడ యిచ్చిన చీటీని మళ్ళీ వెళ్ళీపోయిన ఘాటులో దాఖలుచేసి యాత్రావాండ్లు సాగిపోయిన వయినము లెక్కపెట్టించి రెపోర్టు వ్రాయించివేస్తాడు.

యీ పండాలనే స్థలవాసులని ఏడు వందలు యిండ్లదాకా వున్నవి. వీరు ముప్పదియారు తెగలవారై పూజ వంట మొదలైన పరిచారకము గుళ్ళో చెస్తూవుంటారు. ఈగుడి దేవదాశీలు వింజామరలు మొదలైనవి వేశి వుపచారపు వస్తువులు చేతవుంచుకొని సన్నిధానములో సేవ చేయడముగాని నాట్యమాడడము లేదు. మేళగాండ్లు కొలువులేదు. హాశ్శీలు మూలకముగా లక్షాయిరువైవేల రూపాయిలు సాలుకు వసూలు అవుచున్నవి. అందులో సగముమట్టుకు గుడిసెలవుల నిమిత్తము కంపెనీవారు నెలకు సుమారు నాలుగువేల రూపాయిలవంతున యిస్తూవస్తారు. *

గమనిక, * చూడు. యీపుటలోని వ్యాఖ్యానము.

అన్నిదూపాయిలు ప్రసాదముగా నివేదనచేసి ప్రతి దినపు ప్రసాదాన్ని వారివారి క్లుప్తప్రకారము పంచుకోవలసినదిగాని వొక గవ్వ అయినా రొక్కముగా గుడి యిలాకాదార్లకు దొరకదు

ప్రసాదాలు సింహద్వారము మొదలు ముఖమండపము వరకు గంపలలో పెట్టి అనేక అంగళ్ళుగా అమ్ముతూ వుంటారు. వుచ్చిష్ట వ్యవస్థను విచారించక సమస్త జనులున్ను రుచిచూచి కొనుక్కొనుచున్నారు. కంపెనీవరు మహసూలు వసూలుద్వారా పైన వ్రాసిన ప్రకారము యివ్వడము కాకుండా గుడికి కొంత, లాకు జారి భూమిన్ని వుండివున్నది. స్వామిముందర భేటి యనే కానుకలు యేవివుంచినా సరకారు చేరుతున్నవి. యీ మహసూలు ద్వారా సరకారువారికి సమస్త శలవులుపోగా సాలుకు సుమారు పదివేల రూపాయిలు మిగిలేటట్టు తెలిసినది. ♦

గమనిక, ♦ పద్దెనిమిది వందల నలభై మూడు సంవత్సరము వరకు దేవాదాయములను కంపెనీవారు స్వయముగా పరిపాలించుచుండిరి. కలెక్టరులు రెవెన్యూబోర్డు తనిఖీక్రింద అజమాయిషీ చేయచుండిరి. మిగిలిన సొమ్ము తీసికొనుచుండిరి.

పండాలకు యాత్ర వారిని యాచించి జీవనము చేయడమేకాని వేరే యెటువంటి భూరూపకమయిన ఆకరములేక వున్నా లక్షాధిరారులుగా కొందరు పండాలు వున్నారు.

మూడుమూర్తులున్ను దేవదారు దారువులతో నడుముట్టుకు తీరితీరని అంగములతో చేసివున్నవి. బలభద్రుడు జగన్నాధస్వామియనే మూర్తులకు రెంటికిన్ని మణికట్టులేని హస్తాలు ఆలింగనము చేసుకోను జూచిన వతుగా యేర్పరచి యున్నది. మధ్యేవుండే సుభద్రా బింబము చిరతవాలుగా చేతులు లేకనే యేర్పరచబడి యున్నది. జగన్నాధస్వామికి కుడి పక్క సుదర్శనమనే పేరుపెట్టి వొక ముసలాకారముగా ఆదారువుతోనే వొక రూపము యేర్పరచి వుంచినారు. పన్నెండు సంవత్సరములకు వొకసారి వచ్చే అధిక ఆషాఢమాసములో కొత్తదారువులను తెచ్చి మూర్తులు యిక్కడ పరంపర్యముగా చేసే శిల్పులచేత చేయించి పూర్వికపు కిరాతకుల వంశస్థులలో ముక్తిని ఆపేక్షించి ఏకవారాశము చేసి బ్రహ్మచర్యము చెయుచునుండే వృద్ధులచేత పాతమూర్తుల వక్షస్థలములో వుండే చైతన్యాన్ని కొత్తమూర్తులలో వుంపించి ఆవక్షస్థలానకు బీగము ముద్రలు వెయిస్తారు. సుభద్ర మూర్తిలోని చైతన్యము పరరాష్ట్రస్థులకు చిక్కి వోఢ్రదేశమందే వేరేచోట పూజింప బడుచున్నది. నాకు తెలియడములో బలభద్ర మూర్తిలోను జగన్నాధస్వామి మూర్తిలోను అద్భుతమయిన వొక లోహమిశ్ర మయిన హస్తప్రమాణము గల వొక స్థూలాకృతి పరమాత్మకున్ను వొకవిగ్ర, హ,ము జీవాత్మకున్ను ప్రత్యామ్నాయముగా వుండేటట్టు విన్నాను. సుభద్రా దేవిబింబములో వొకలక్ష్మీనారాయణ మూర్తి సాలగ్రామము మాత్రము వుండేటట్టు పీఠము మీద మెత్తతలగడలు వేశి వుంచి వస్త్రాలంకారము చేసివుంచుతారు. గనుక కాళ్ళుకలిగినట్తుగానే దర్శనమూవుతూవుంచున్నది. జగన్నాధ బింబమునకు నీలవర్ణము పూశి యున్నారు. బలభద్రబింబమునకు శ్వేతవర్ణముమున్ను సుభద్రకు పసుపువర్ణమున్ను పూసి వర్ణముతో కండ్లుముక్కు యేర్పరచి యున్నారు. రత్నమయముగా మూడుశిరోభూషణములు మూడు బింబములకు ధరించివున్నవి.

నిత్యము యేడు భోగ్యపదార్ధములు నివేదన మవుచున్నవి. వాటిలో ప్రధమద్వితీయాలు యేమంటే బాలభోగ్య మొకటిన్ని కిచ్చిడి భోగ్యమొకటిన్ని యీ రెంటిలోనే విశేషపదార్ధాలు చెరడముగాని తతిమ్మా భోగ్యమునంతా అన్నము పప్పుకూరలు చారు పులుసు పరమాన్నము వడలు అతిరసాలు మొదలయిన పిండివంటలున్ను చేరి నివేదమవుచున్నది. బాల భోగ్యానకు దూదుపూరీ అని పాలమీగడతో వొక దినము పూరీచేస్తారు. అది అపూర్వముగా తోచినది. మిరపకాయలకు బదులు మిరియాలు వాడతారు. హారతికి పచ్చకర్పూరము వాడుతున్నారు. ఉదయకాలమందు దంతధావనసేవయున్ను అర్ధరాత్రిలో బడాశృంగారపు సేవయున్నుముఖ్యములు. నైవేద్యమయ్యేవరకు ప్రసాదాలు నియమము కల పండాల అధీనముగా వుంచున్నవి. నైవేధ్యానంతరము జాతిహీనుల అధీనమయి అందరికి వారు తెచ్చి యిస్తూ వుంటారు. వంటశాలలో పాచకులు తప్ప యితరులు పోకూడదు.

జ్యేష్ఠశుద్ధ పున్నమనాడు గర్భగృహములోనించి మూర్తులను వెలిప్రాకారములో వుండే అభిషేక మంటపానకు నడిపించి తీసుకుని వచ్చి జ్యేష్ఠాభిషేక మంటపములో సాయంకాలము దాకా వుంచి రాత్రి మళ్ళీ నడిపించి గర్భగృహము వద్దికి తీసుకొనిపోయి మరుసటి అమాస్య వరకు తెరకు లోపల యెవరికిన్ని దర్శనము లేకుండా శయనావసరముగా మూర్తులను వుంచి పెట్టుతారు. యీపక్షము యావత్తు కిరాతక వంశస్థుల ఆరాధనతో మూర్తులుంటున్నవి. పండాలుకూడ చూడడము లేదు. జ్యేష్ఠాభిషేక మంటపము బహువున్నతముగనుక ఆ అభిషేక దినము సాయంకాలము వరకు వూళ్ళో యెదటి వీధులలో వుండే వారికంతా స్వామిదర్శనము అవుతూవుంచున్నది. యీదినపు యాత్రనున్ను రధయాత్రనున్ను పతితపావనయాత్ర అని యిక్కడివారు చెప్పుచున్నారు. జ్యేష్ఠాభిషేకానంతరమువచ్చే అమావాశ్యమీది పాడ్యమినాడు ప్రతిసంవత్సరమున్ను చేసే క్రొత్తరధాలు మూటినిన్ని సింహ గొప్పది. పది వందల యిండ్లు వుండును. రధములుపొయ్యే వీధులు మాత్రము నిండా విశాలముగా వున్నవి. స్వతంత్రుఘుగా శీమనుంచి వచ్చివుండే పేయిర్ అనే దొరను యాత్రవారి మహసూలు వసూలు చేసే పనులలో కలకటరు హస్తాంతరముగా మామూలు ప్రకారము అటారానాళాఘాటువద్ద వుంచి వున్నారు. యాత్రవారి సమేతముగా పండాల విచారణ ఆ దొర పరమై వుంచున్నది. బియ్యము మొదలయిన సమస్త పదార్ధములు అంగళ్ళలో వుండేవి. స్వామికి నివేదనాహ్రములు గనుక వాటిని వాసన చూచి మళ్ళీ ఆ రాసులలో వెయ్యనియ్యరు. యీ నియమము వింతగా యీవూళ్ళో జరుగుచున్నది. మహాజనులనే సాహుకారులు యీ వూళ్ళో లేరు. సమస్త పదార్ధములు దొరుకువున్నవి. యీవూరు సముద్ర తీరమందున్నవి. యిక్కడ సముద్రస్నానము బహుముఖ్యము. జాతులవాండ్లు సముద్రతీరమందు యిసుక దిబ్బలలో వుపాయమైన యిండ్లు కట్తుకుని కాపురమున్నారు.

కొత్త మూర్తులను ప్రతిష్ణచేసిన వెనక గుళ్ళోవుండే పాత మూర్తులను మూటినిన్ని రెండో ప్రాకారములో వుండే మోక్షద్వారమనే కూపములో ప్రవేశింప పెట్టుతారు. ఆ కూపము అగాధమైన లోతని తెలియవచ్దినది. ఆ కూపము వుండే ప్రదేశానకు యిక్కడివారు పోను భయపడుతూ వుంటారు. పాతమూర్తులలో నుండిన చైతన్యకళలను కొత్తమూర్తుల వక్షస్థలములలో ప్రవేశింప పెట్టినవెనక రెండుమూడు నెలలలో ప్రవేశపెట్టిన వృద్ధ కిరాతకులు దేహాలు వదులుతారని నిశ్చయముగా తెలిసినది. దానికారణము యీశ్వరునికే తెలుసును. అయినా నాకు భయమే కారణముగా తొచుచున్నది. యిక్కడ నాలుగు కూరలు పప్పుపులుసు పరమాన్నము రెండు పిండివంటలతో సాధారణముగా వెయింటికి భోజనము చేయించ వలిస్తేయిన్నూటయాభై రూపాయలు సరాసరిపట్టుచున్నవి. యిక్కడ అనేక మకాలున్ను రోగిష్టులకు ప్రసారవినియోగమయ్యే కొరకు కంపెనీ ధర్మశాల వొకటిన్ని వుండేటందున బ్రాహ్మణ భోజన నిమిత్తము వొకదినము ముందు పిలిస్తే పండితులు పామరులుసహా వెయ్యింటికి చేరుతారు. గుడి పండాలలో పద్నాలుగు వందల కి దాకా చేరుదురు. గోసాయిలు బయిరాగులు యేనూటికి చేరుతారు. వొక్క అణాపామరునికిన్ని నాలుగూణాలు పండితుడికిన్ని దక్షీణ యిస్తే ఆనందింపుచున్నారు. గొప్పవాడు యీ స్థలము విడిచిపెట్టి వచ్చేటప్పుడు గుడియిలాకాపండాలకు నూరు రూపాయలు బహుమతి రూపముగా మొత్తముగా యిస్తే వారివారి తారతమ్య ప్రకారము కలియపంచుకొని తృప్తిని పొందడము లేదు. నాపరువుకు మొన్నూరు రూపాయలు ముట్టచెప్పితే యెంత మాత్రము నా పురోహితునికి కనికరము తోచ లేదు.

వింధ్యకు ఉత్తర దేశస్థులు యెందరు ధనికులు యెందరు ప్రభువులు యే యాత్రవచ్చినా యే సత్కర్మలు చేయతలచినా తోచిన కాలమందు యీశ్వరుడు యిచ్చిన సంపత్తుకొద్ది దానాలు చేసి యత్నసిద్ధి గలవారవుతారు గాని దాక్షిణాత్యుల స్వభావము వలె నేటికి బోరిగెల కోనుకోగానే సరేనా, యెల్లప్పటికి వొక్కటేరీతిగా నడవను యోచనచేసి ఒక్కటే నిదానముగా ధర్మము చేయుచూ వుండవద్దా? అని వెర్రితనముగా యీశ్వరవేద్యము లయిన భవిష్యత్కార్యములను తమకు తెలిసినట్టు తమ అధిక జాగ్రత్తవల్ల కొన్నిపనులు నడవతగ్గట్టుగా యీశ్వరుడు కటాక్షించిన కాలమందు కూడా శక్తికొద్ది ధర్మము చేసుకోకుండా విత్తము త్యాగభోగరహిత మయ్యేటట్టు దాచి వ్యర్ధోపయోగ మయ్యేటట్టు చేయడములేదు. గనుక హిందుస్తానులోని గొప్పవారు యీ పండ్యాలవంటి యాచకులకు యిచ్చే ప్రకరణములో అతిశయమైన యీవిని యిస్తారు గనుకనున్ను దక్షిణ దేశస్థులు కొంచముయిచ్చి తియ్యనిమాటలు శానా చెప్పుతారు గనుక దక్షిణ దేశస్థులకు యేర్పడివుండే పండ్యా దాక్షిణాత్యులకు రాక్షసులని నామకరణము చేసినాడు.

ఈ స్థలముయొక్క రీతి యేమంటే గుళ్ళోవుండే బింబాలు నిరూపించకూడని స్వరూపాలతో వుండడమున్ను రెండుబింబాలు యిరు పక్కల వుండేవి యధోచితముగా సమయమయిన గాత్రముతో వుండడమున్ను మధ్యే సూక్ష్మరూపముతో ఒక బింబము స్త్రీ అని పురుషుడనిన్ని సందేహవిషయముగా వుండడమున్ను వుచ్చిష్టనిషేధములు లేక ప్రసాదస్వీకారము చేయడమున్ను ప్రసాదముమీద అత్యంతగౌరవమున్ను జాతినియమ వర్జితమున్ను యివిమొదలయినవి కలిగియున్నవి. వీటిని యావత్తున్ను వొక సమూహముచేసి వాటివాటి కారణాలున్ను ఆ కారణాలలో పరంపరగా జన్యమయ్యె కారణాలున్ను యివంతవిచారించగా నా బుద్ధికి తొచడము యేమంటే సమస్తమయిన కర్మభూమియందున్ను సగుణోపాసనకు అనుకూలముగా అనేక దేవతల ఆరాధనలు నియమించి వారివారి భార్యలతోకూడా బింబాలను చేసి వాటికి మందిరములు కట్టి ఆరాధింపుచూ వుండగా నిష్కాముడయి మహాత్ముడయి నామరూప రహితుడయి జ్ఞాన స్వరూపుడయిన దేవునియొక్క రీతిని లోకులకు కృష్ణలీలలను భాగవతసేవ అనే ఆటమూలకముగా ప్రసిద్ధపరచినట్లు యీ జగన్నాధమందిరాన్ని కట్టి యిందులోని మూర్తులను యీరీతిగా రూప నిర్ణయములేక కల్పించి స్థాపించి వొక తత్వ సంగ్రహ పురాణద్వారా ఉచ్చిష్టదోషరహితముగా ప్రసాదగ్రహణము జాతిభేద నివృత్తి యీ స్థలములో కలుగజేసి ప్రకాశింపచేసినట్టు తోచుచున్నది. దని క్రమ మేమంటే శుద్ధతత్వము సమస్తశౄతి చోదితముగా నాదము బిందువు కళ అతీతము అని చెప్పబడుచున్న నాలుగు వస్తువులు ఒకటిగా అయితే అవాజ్మానసగొచర వస్తువు ప్రకాశిస్తున్నది. నాదస్వరూపమయిన జీవాత్మ, బిందు స్వరూపమయిన ఆత్మ కళా స్వరూపమయిన అంతరత్మ, అతీత స్వరూపమయిన పరమాత్మ వీటియొక్క రూపములు యిట్టివని నిర్ణయించ కూడనిది సత్యము గనుక నిర్ణయించకూడని రీతిగానే జీవాత్మ అని చూపించేకొరకు యిప్పట్లో బలభద్రుడనే బింబాన్ని చేసి ఆత్మ నిరూపణ కొరకు సుభద్ర బింబాన్ని చేసి అంతరాత్మయొక్క నిరూపణకొరకు జగన్నాధస్వామిబింబాన్ని చేసి పరమాత్మ నిరూపణకొరకు శుద్ధస్తంభాకారముగా వుండే సుదర్శన బింబాన్ని కల్పించి యీ నాలుగింటిని బోధితము లయ్యేటట్టు చేయడము అవాజ్మానన గోచరవస్తువుయెక్క అన్నమయినందున ఆ అన్నాన్ని ప్రసాదముగా యిక్కడ పేరుపెట్టి సమస్తానకు ఆధారభూతము అన్నము


ఇరువదిరెండవ ప్రకరణము  జగన్నాథ క్షేత్రము నుండి గంజాము

గనుక దాన్ని సమస్తవిధాలా యిక్కడ పూజితపరచి అన్నము యెట్టిగతిని పొందినా నిషిద్ధముకారని యేర్పరచి ప్రపంచము యావత్తు పైన వ్రాసిన అయిదు పదార్ధాలకు అంతర్భూతము అయినది గనుక నేను యెక్కువ, నీవు తక్కువ అనే బుద్ధి లేకుండా జాతి నియమాదులు కూడా మరిచిపోయి ప్రవర్తించేటట్టు ప్రసాదస్వీకార విషయములో వొకనిర్ణయము గలగచేసి అందుకు కొన్ని పురాణాలున్ను ప్రసిత్థ పరచినట్టు తోచుచున్నది. అటువంటి సారవత్తైన పురాణాలున్ను ప్రసిద్ధ పరచినట్టు తోచుచున్నది. అటువంటి సారవత్తైన పురాణములు ఇక్కడ దొరకకపొయినా వాటి కధాక్రమము యెవరికైనా యిక్కడ జ్ఞాపకము వుండునా అని విచారిస్తే యెటువంటి పండితునికిన్ని నాకు తోచినకధ వినికిడి అయివుండేటట్టు తోచలేదు. అయితే పరబ్రహ్మ నాలుగాకృతులతో యీ స్థలమందు ప్రకాశింపు చున్నా డని వొక మాట స్థూలముగా పండితుల వాక్కున ప్రచురముగా వినపడుచున్నది. వాటి క్రమ మేమని అడిగితే ధోరణిగా చెప్పను వారికి వినికిడి లేకుండావున్నది. యిటువంటి మహాస్థలములో జూన్ నెల ఇరవై ఆరు తేది వరకు వసించినాను.

తేది భోజనోత్తరము పదకొండు ఘంటలకు బైలుదేరి యిక్కడికి నాలుగు కొసుల దూరములో వుండే సరసింగఘాటు అనే వూరు మూడు గంటలకు ప్రవేశించినాను. యీ వూరు చిన్నదైనా ముసాఫరులకు కావలసిన సామానులు అన్ని యిచ్చేపాటి కోమట్లున్నారు. యిక్కడ కోమట్లు రెండుతెగలు. కళింగ కోమట్లని వొకతెగ, గౌరకోమట్లని వొక తెగ. దక్షిణదేశములో వుండే తెగ గౌరకోమట్లు. యిక్కడగౌరకోమట్లు నిండాలేదు. యీవూళ్ళోదక్షిణదేశస్థుడు ముద్ధుకృష్ణ పిళ్ళ అనేవాడు గంజంలో వుద్యోగముచేసి వొక డాబా అనే సత్రము చుట్టు మిద్దెవేశి కట్టి మధ్యేజగనాధస్వామికి వొక మందిరముకట్టి వొక తటాకము వొక వనప్రతిష్ట చేసి భూస్థిరులు సంపాదించి అతిని ఆచార్యపుషుడు జగన్నధ నివాసియై వుండగా అతనికి దానము యిచ్చినాడు.

ఆ డాబా యేనూటికి దైగేపాటి విశాలముగా వున్నది. గుళ్ళో వొఢ్ర బ్రాంహ్మణుని గుండాపూజ నడిపింపుచు అప్రతిగృహీత సంతతివారు యిప్పటికి వుంచుకొని వుండేటందున అందులో దిగినాను. యీవూరికి సమీపముగా జగన్నాధ క్షేత్రములో వుండే పండ్యాలు మొదలైన వారికి ముఖ్యమైన యిష్టదేవత అయిన వొక చండీదేవి ప్రతిమ వొక చిన్న కొండమీద ప్రతిసంవత్సరము తామరసపూజలు అంగీకరింపువువున్నది. నేటిరాత్రి సముద్రతీరమందు యిసుకలో నడిచివచ్చినాము. యెండ కాలములో దారి యిక్కడ నడవడము ప్రయాస అనిపించును. చెట్లనీడకూడా లేదు. యీ నాలుగు కోసులదారికి చెరిసగములో వొక మంచి నీల్లబావి నొక బోగంది తొవ్వించినది వున్నది.

తేది వుదయాత్పూర్వము మూడు గంటలకు లేచి యిక్కడికి తొమ్మిది కోసులదూరములో వుండే మాణీక్యపట్టణము ఏడు గంటలకు చేరినాము. నిన్నదిగిన మజిలీపూరివద్ద వొక వుప్పుటేరు వున్నది. పాటుపోటు కాలాలు చూచి దాటవలెను గాని పడవలువుండే పాటి లోతు కలది కారు. నేటిదారి సముద్రతీరము. యిసుకలో చిలక సముద్రము అనే వుప్పుకయిదారిగా నడిచివచ్చినాము. మాణిక్యపట్టణములో పోలయిసుదారోగా వుంటాడు. యీ వూరు మొదలుగా మూలఝూ అనేవూరువరకు వొక తురకవానికి జాగీరు. యిక్కడా సమస్త పదార్ధములు అంగళ్ళలో దొరుకును. యీవూరివద్ద చిలకసముద్రము దాటవలసి వున్నది గనుకనున్ను యాత్రవారికి దిగడానకు స్థలములేక ప్రయాసపడుతూ వుండినారు గనుక గంజాం కలకటరువద్ద శిరస్తాగా వుండే వెంకన్నపంతులు జాతి విభజనగా దిగడానకు వసతిచేసి సుందరమయిన ధర్మశాల కట్టి సదావృత్తి అందరికి యిస్తూ వున్నాడు. యీ ధర్మశాలలో యీ దినము వసించినాను.

తేది వేకువనే మూడు గంటలకు లేచి అక్కడికి నాలుగు కోసుల దూరములో నున్న మిఠాగువ్వ అనేవూరు పన్నెండు గంటలకు చేరినాను. ఇంత ప్రొద్ధుపోను కారణమేమంటే, బయిలు దేరిన వూరిముందర చిలకసముద్రమనే నది దాటవలెను. అది రెండు కోసుల వెడల్పు కద్దు. దాన్ని దాటింఛే హక్కు యిచ్చటి జాగీరువారు డయిన తురకకు యివ్వబడి వున్నది. ఆ తురక యీనదిలొ పడవలను పురుగులు తూట్లుపడేటట్లుగా తినివేస్తున్నవని నలుగు యెక్కేపాటి వొంటికొయ్య దోనెలు నాలుగయిదు చెయించివున్నాడు. మనిషికి అణా ఒకటి బండికి ర్పు నాలుగు, సున్నా నుంచి ఎనిమిది వరకు-సున్నా, గుఱ్ఱానికి ర్పు ఒకటి, సున్నా నుంచి నాలుగు వరకు-సున్నా, యీలాగు కూలితీసుకుని దాటింపుచున్నాడు. ఆ చిన్నదోనెలతో నా పరిజనము నూరుమందిన్ని, మూడుబండ్లున్ను, మూడు సవరీలున్ను దాటను అక్కడనే వుదయమయిన ఏడు గంటలదాకా పట్టేను. నాకు సర్కారుకుమ్మక్కు వున్నందున అంత త్వరగా దాటినాను. సాధారణమైనవారు రెండు మూడుదినాలు కాచివుండవలెను.

యీ మిఠాగువ్వలో వుప్పుకొఠారులు వున్నది గనుక వాటి అధికారస్థులు ఇండ్లుకట్టుకుని వున్నారు. జాగీరుదరుడు కట్టించిన డాబా సముద్రపు యిసుక పెట్టి పూడిపోయినది. యిప్పుడు త్రొవ్వి బయటికితీసినా దిగను వసతిగావుండలేదు. వొక్కమర్రిచెట్టు తప్ప వెరే చెట్టునీడకూడా లేదు. వొక్కటే అంగడి వున్నందున అక్కడ వొక బావివొడ్డున చెట్టునీడలో వంటభోజనము కాఛెసుకుని రెండు గంటలకు బయిలుదేరి రాత్రి ఆరు గంటలకు యిక్కడికి ఆరుకోసులదూరములో వుండే మాలుఝూ అనేవూరు చేరినాము.

యిక్కడ జాగీరుదారుడు కట్టిన డాబా పనికిరాక వున్నది. వూరు పెద్దది అయినప్పటికి యాత్రవాండ్లు దిగడానకు స్థలము లేదు. వూరిముందర వొక పెద్ద వటవృక్షమున్ను అమృతతుల్యమైన జలము గలిగి మంచివూటగల బావి వొకటిన్ని వుండగా వాటివద్ద డేరాలు వేశి దిగినాను. యిక్కడ పోలీసు జమేదారుడు వుండే స్థలము గనుక తాత్రిపారాచౌకీ యివ్వడానకు నలుగురు చౌకీదార్లను పంపించినాడు.

కలకత్తా మొదలుగా ప్రతిగ్రామములోనున్ను దక్షిణదేశములోని తలారులు వలెనే యిక్కడ నాయకు లని కొందరు వుంటారు. యిదిన్నిగాక చౌకీదార్లని సరకారువారు యేర్పరచిన వారు కొందరు ప్రతివూరికి వుంటారు. అందరున్ను పోలీసు నౌకరుల అధీనమయి వుంటారు. ఈ మాలుఝూ అనే వూళ్ళో పది అంగళ్ళదాకా వున్నవి. సమస్త పదార్ధాలు దొరుకును. నేటిదారి చిలక సముద్రము మూలుఝూ యీరెంటి మధ్యే యీ దినమంతా నడిచినాను. దారి శుద్ధ యిసక, నిలవ నీడలేదు.

తేది ఉదయాత్పూర్వము నాలుగు గంటలకు లేచి యిక్కడికి ఐదు కోసుల దూరములో వుండే ప్రయాగ అనేవూరు రెండు గంటలకు చెరినాను. యీవూరు మొదలుగా మదిరాసు గౌర్నమెంటు యిలాకాతో చేరినది. వూరుగొప్పదేను. అన్నిపదార్ధాలు దొరుకును. యిక్కడ వొకతపాలా రైటరు గంజాం కలకటరుకింద వున్నాడు. సుంకంచావడి వొకటి వున్నది. వచ్చేపొయ్యేవారి మూటముల్లెలు సరిహద్దుజాగా అయినందున ఆ సుంకరులు శొధించి చూస్తారు. యీవూరు మొదలుగా చెన్నపట్టణపు రూకలు చెల్లుచున్నవిగాని యీ ప్రయాగలో పట్టరు. యీ హద్ధుమొదలుగా పిచ్చశేరులు. శేరు ఒకటి కి యిరవై రూపాయల యెత్తు., శేరు యిన్నిరూకలని వెలగాని యిన్నిఅణాలు పయిసాలు అనుకోవడము లేదు. గంజాములో వుండే వొక గౌరకోమటి యిక్కడ విశాలముగా డాబాకట్టి వొక వనప్రతిష్ట, తటాక ప్రతిష్టయున్ను చేసి భూస్థితికూడా వాటి పరిపాలనకు సంపదించినాడు.

యీ ప్రాంతములలో కొండలు గుహలు అడువులు కల ప్రదేశాలను మన్యా లంటారు. ఆ మన్యాల యజమానులను మన్యదొర లని చెప్పడము, వారి తమకు యిష్టములేనివారి యిండ్లను కలిమిగలవారి యిండ్లనున్ను మనుష్యులకు రాత్రిళ్ళు దివిటీలు యిచ్చి పంపించి కొళ్లపెట్టించి మనుష్యులను నరికించి యిండ్లను కాల్పిస్తూ రావడము సహజముగనుక అదేరీతుగా యీవూరి తపాలారైటరు యిల్లు మరివొకరిద్దరి వర్తకుల యిండ్లున్ను పదిహేను రోజులకిందట యీ ప్రాంత్యపు జమీదారుడు దోపించినాడు. యీ దేశపుజమీదారుడు డాబాభూస్థితిని కప్తీ చేసుకొన్నందున డాబా బేమరామత్తు కింద వసతి తప్పివున్నది. సమీపమందుండే టెంకాయతోపులో డేరాలు వేయించి వంట భోజనము చేసుకొని ఒకటి గంటకు బయలుదేరి యిక్కడికి ఏడు కోసుల దూరములో వుండే గంజాం అనే షహరు తొమ్మిది గంటలకు చెరినాను.

వుదయాన నడిచినదారి సముద్రతీరమైనప్పటికి యిసక వొక మాత్రముగా వుండినది. భోజనాత్పరము నడిచినదారి యేనుగపొడుగు యిసక దిబ్బలమధ్యే వొకపక్క సమద్రము, కుడిచేతిపక్క అంది పుచ్చుకున్నట్టు మింధ్యపర్వతము వుంచూ వచ్చినది. యిక్కడ వింధ్యపర్వరము సముద్రములో కలిసినట్టు తోచుచున్నది. యిక్కడ యెప్పుడున్ను దొంగలు కొట్టి దోచడము వాడికె యని తెలిసినది. నిలవనీడ, తాగ నీళ్లున్ను దొరకవు. ప్రయాగకు గంజానికి చెరిసగములొ వొకబావి. వొక చిన్న శివాలయమున్నున్నది. ఆగుడిచుట్టూ యీశ్వరాజ్ఞ చేత వొక మర్రిచెట్టు ఆవరించినట్టు అల్లుకుని యేనూటికి చాలేపాటి చల్లని నీడ గలిగివున్నది.

గంజాం షహరు పదిహేను యేండ్లకిందట మల్లాడి యనే జ్వరముచేత హతమైనది గనుక నున్ను మిగిలినవారు బురంపురమునకు వలసవెళ్ళి అద్యాపి అక్కడి నివాసులై యున్నారు గనుక షహరు పాడుపడ్డట్టుగా కనుబడుచున్నది. యిక్కడ వాడలు మరామత్తు చెయ్యడానకు గంగాతీరమందు కలకత్తాలోనుంచి వుడిబడియాకు నావలమీద వచ్చే దారిలో బాందలు అమితముగా చేసి పగిలిన వాడలు వుంచివుండేటట్టు యిక్కడ సముద్రతీరమందు గదులు చేసి వాడలు వుంచివున్నది. అనేక గొప్పయిండ్లు ఖాలిగా వున్నవి గనుక అందులో వొక యింట్లో దిగినాను. యిక్కడ వొక రేవుదొర, వొక కొత్తవాలు న్ను న్నారు. మొసాఫరులకు కావలసిన పదార్ధాలు ఆని దొరుకుచున్నది.

యీ గంజాం పట్టణము ఋషికుల్య అనే నదితీరము. వింధ్యగిరి యిక్కడనే సముద్రగామి యయినందుననున్ను, యీ గంజాము వింధ్యకు దక్షిణదేశ మనిపించుకోబడి యిక్కడివారు యీ ఋషి కుల్యనది మొదలుగా చాంద్రమాన రీత్యా అయ్యే ప్రభవాది సంవత్సరములను సంకల్పములో చెప్పుతారు. ప్రయాగ యనే వూరివరకు బృహస్పతి మానము, గంజాం మొదలుగా చాంద్రమానము. గంజాం మొదలుగా యీశ్వర నిర్ణయ ప్రకారము కళింగదేశము ఆరంభమవుటఛేత యిండ్లు మనుష్యుల అలంకారాలు దృష్టిదోషపు పాటింపులు దక్షిణదేశము వలెనే యావత్తు కలిగివున్నవి. చిన్నయిండ్లకు కూడా వాకిట పంచవన్నెలు పెట్టేకట్టినారు. ప్రతిస్త్రీలు బులాకులు ముక్కర ధరించివున్నారు. సమీపమున వుండే మాలుఝూ అనేవూరిలో యెవరికి రాని తెనుభాష యిక్కడ అందరికి వచ్చివున్నది.

జూలాయినెల ఒకటి తేదీ వుదయాత్పూర్వము మూడుగంటలకు లేచి యిక్కడికి నాలుగు కోసుల దూరములోవుండే నాయడిపేట అనేవూరు యేడుగంటలకు చేరినాను. యీ దినము దారి మదరాసు గౌర్నమెంటువారి హుకుము లోబడ్డభూమిలోది గనకనున్ను యీ గౌర్నమెంటువారి యోచన లగాయతునుంచి హిందువులను చలిపురుగులకు సములనే అగౌరవబుద్ధితొ ఆత్మార్ధమైన పనులలో సర్వకృషిచేసి పరార్ధమైన పనులుమాత్రము యీశ్వరాధీనముచేసి వుండడము సహజము గనుకనున్ను కలకత్తా గౌర్నమెంటువారి వలెనే లోకోపకారమైన దారులను గురించి సడక్కువేశే ప్రయాస వీరు విశేషము పుచ్చుకోకుండా వున్నందున యశోవిలాసముగా అడివి యీజిల్లాలొ బలిసివున్నది గనుక ఆ అడివిలో సూటిగా లయనువేసి నూరడుగుల వెడల్పుకు అడివికొట్టి శాలచెట్లు పెట్టినారు. ఆ చెట్లుమాత్రము అక్కడక్కడ వొకటొకటి జీవించివున్నది. భూమిని చదరంగానైనా చేసినవారుకారు గనుక లయనుకు చుట్టూవుండే చదరపు భూమిని వెతుక్కుని దారినడిచేవారు తాము దారులు కలగజేసుకుని నడుస్తూ వున్నారు.

యా దినమంతా భాట అడివి దారిలో చత్రపురమనే వూళ్ళో కలటరు స్థలవసతినిమిత్తము వసింపుచున్నాడు.*

గమనిక, * అరణ్యమార్గంగా చత్రపురానికి ప్రయాణము కలకటరుకచేరీలో ట్రాంసులేటరుగా వుండే కపిల రామదాసు పంతులుగారికి నేను ఒక వుత్తరంద్వారవ్రాసి వున్నంతలో ఆయన నలభై కావళ్ళ రెండు డలాయతులు ఒక గుమాస్తాను పంపి అరణ్యమార్గం సుళువు చేయించినాడు., చూ. వ్రాతప్రతి పుట నాలుగు వందలు పంతొమ్మిది,

యీనాయుడిపేట యనే వూరు అడివిమధ్యే వున్నది. ఆవూరి వద్ద అడివికొట్టి బందా చలమయ్య యనే కోమటి వొక డాబా కట్టించి గుంటబావి తొవ్వించినాడు. వొక అంగటివాడు వున్నాడు. అక్కడ పదార్ధాలు మృగ్యముగా దొరికినవి. అక్కడ భోజనము కాచేసుకుని అక్కడికి మూడుకోసులదూరములో వుండే బురంపురమనే బస్తీ నాలుగు గంటలకు బయిలుదేరి యేడు గంటలకు చేరినాను. దారి తెల్లవారి వలెనే వున్నది.

బురంపురము బస్తీవూరు. గంజాంలో మకారత్రయమనే మల్లఛి మార్తా మరాహి అనే జ్వరములవల్లనున్ను కొండపాళెగాండ్ల బందిపోటువల్లనున్ను మరాటీల కొళ్ళగుర్రాలవల్లనున్ను అర్ధములు ప్రాణాలున్ను పోయి బేజారయిన వెనక కలకటరు మొదలయిన ధైర్యము గల యింగిలీషుదొరలు సమేతముగా ఋషికుల్యానది దాటడానకు సందుచిక్కకుండా వలస వచ్చి ఈ బురంపురము ప్రవేశించినారు గనుక అదిమొదలు యీవూరు వొక పటాలముదండు కూడా వుండబట్టి బహు బస్తీ అయివున్నది.

యీవ్చూళ్ళో కొద్దిదినములకు ముందు సర్వతోముఖమనేక్రతువు నడిచి ఆక్రతువు నిమిత్తము నన్ను యెరిగిన గోదావరీతీరపు బ్రాహ్మణమండలి నూటిదాకా యిక్కడ వచ్చివున్నది. ఆ బ్రాహ్మణులందరున్ను శ్రౌతవిషయము బాగా తెలిసినవారు గనుక అధర్వణ వేదము మూలమా లేక కడమ మూడు వీడాలసంగ్రహమా అని నాకు బహుశ, వున్న సందేహము వారివల్ల తీరు నని వారిని విచారించినంతలో సంగ్రహమేనని తీరినది. అందుకు ఆకరము సర్వతోముఖ యాగములో కడమ మూడు వేదాలవలెనే అధర్వణానకు ప్రత్యేల్కాధ్యరము లేదు. పయిగా లోకప్రకటనకు భారద్వాజులు మూడువేదాలే తెచ్చి యీ మూడింటిలోనుంచి అస్త్రప్రయోగ నిమిత్తము మంత్రమగ్రహము చేసిక్షత్రియులకు అధర్వణమని పేరుపెట్టి వొక వేదము చేసియిచ్చినారు. పంచగౌడులలో గాని పంచద్రావిళ్ళలో గాని మేము అధర్వణుల మని చెప్పేవారు యెవరున్ను లేరు.

కలకత్తాలో నుంచి జగన్నాధమువరకు బోయీలకు జనము వొకటింటికి యేడురూపాయలు లెక్కను, బండి వొకటింటికి యిరువై యెనిమిది రూపాయలు లెక్కను తెచ్చి జగన్నాధమునుంచి మళ్ళీ బురంపురమువరకు వేరేబోయీలను, కావడివాండ్లను జనము వొకటింటికి ర్పురెండు, రెండు నుంచి నాలుగు వరకు-సున్నా, వంతున బండి ఒకటి కి ఏడు ర్పు లెక్కనిష్కర్షచేసి తెచ్చి నాను గనుక వారికి యివ్వవలసినది తీర్చియిచ్చి వేరేబోయాలను వస్తూ వుంచున్నవి. యిక్కడి నేతగాండ్లను దేవాందులంటారు. యీ దినపుదారిలో వున్న అడివి బలిశివున్నది. బహుశా భూమి నల్లరేగడ. దారిలో మంత్రిరెడ్డి అనే వూరు వున్నది.

తేది వుదయ మయిన ఐదు ఘంటలకు లేచి యిక్కడికి ఐదు కోసుల దూరములో వుండే కంతర్ల అనే వూరు పది గంటలకు చేరినాను. యిక్కడా అయిపోలు, అయిపోలు?, వారు అనే యీ దేశపు వర్తకులు వొక సత్రముకట్టి తటాకప్రతిష్ట, వనప్రతిష్టలు చేసి వొక గోసాయి అధీనము చేసినందున ఆ ధర్మశాలను గోసాయీలు వారి నివాస మఠముగా చేసుకుని అందులో వొక మూర్తిని పెట్టి అరాధన చేయుచూ సత్రానికి వుండే భూస్థితిని తమ అనుభవములోకి తెచ్చుకొని సదావృత్తిని నిలిపివేసి ఆధర్మశాలలో భాటసారులను ప్రవేశించనియ్యకుండా నిర్బంధము పెట్టుతూ వచ్చినారు గనుక యీ జిల్లా శిరస్తా వెంకన్నపంతులు యిక్కడనున్నూ, వేరే ధర్మశాల విశాలముగా కట్టింపుచున్నాడు. యిక్కడవుండే కోమట్లు యిటీవల బందిపోటువల్ల వొచ్చిపోయి విడవలి యిండ్లు బందిపోటువారి దీపారాధనకు అనుకూలముగా మళ్ళీ కట్టుకుని, వచ్చినవారికి కావలసిన సామాను యిస్తూవున్నారు. యీవూళ్ళో గుంటవొడ్డున వంట, భోజనాలు కాచేసుకొని మూడు ఘంటలకు బయిలువెళ్ళీ యిక్కడికి మూడుకోసుల దూరములో వుండే కొత్తపల్లియనే వూరు నాలుగు గంటలకు చేరినాము.

యీ వూరివద్ద మహేంద్రతనయా అనే నది వొకటి వున్నది. యీవూరు బ్రాహ్మణ అగ్రహారము. యిది మొదలుగా వింధ్య దక్షిణదేశమయినందున అవశాత్తుగా గంగా యమునా మధ్యప్రదేశమునుంచి వచ్చిన బ్రాహ్మలను యిక్కడిరాజులు ఆదరించి బ్రాహ్మలు దేవమందిరాలు గల వూరే శ్రేష్టమని అక్కడక్కడ బ్రాహ్మలను ప్రవేశపెట్టుతూవచ్చినందుననున్ను యధారాజా తధాప్రజా, అనే వాక్యప్రకారము ఒక పాటిభూస్వాతంత్ర్యము కలవారుకూడా తమతమవూళ్ళల్లో బ్రాహ్మలకు వసతులు చేసియిచ్చి యిండ్లుకట్టి యిస్తూవచ్చినారు గనుకనున్ను యిదిమొదలుగా కన్యాకుమారి పర్య్హంతము బ్రాహ్మణాగ్రహారాలు చూస్తూ రావచ్చునని తోచినది. కొండమార్గములో గోదావరి దాటినది మొదలు యీవరకు అగ్రహారమనే మాట వినలేదు. పంచద్రావిడబ్రాహ్మలు వొక సమూహముగా వున్నవూరు వొకటిన్ని లేదు. వోఢ్రదేశములోని మనుష్యులు మూర్ఖులున్నూ హఠవాదులున్ను కృత్రిమముచేత హఠము సాధింఛేవారుగానున్ను నాకుతోచబడ్డది. యీబరంపురపు షహరుతో వోఢ్రదేశస్థుల ప్రచారము నిలిచిపోయినది. యిక్కడ అందరు తెనుగువాండ్లేగాని వోఢ్రదేశస్థులు అతిస్వల్పముగా నున్నారు. యీ బ్రాహ్మలయిండ్లు చిన్నవైనా అందులోనే దిగినాము.

తేది వుదయాత్పూర్వము మూడు గంటలకు లేచి యిక్కడికి ఐదు కోసుల దూరములోనుండే పలాశీ యనే వూరు ఏడు గంటలకుచేరినాను. యూవూరు గొప్పదేను. వొకమఠము కొన్ని బ్రాహ్మణయిండ్లునున్నవి. మఠములో దిగినాను. యీవూళ్ళూన్ని జమీందారులవి. యీ గంజాం జిల్లాలో సరకారుకు పన్నెండు లక్షలరూపాయిలు వసూలవుచున్నవి. అందులో జామీందారులవశముగా వుండేభూమి ఆరులక్షలరూపాయలది గాక మలకు రాజీలని కొన్ని ముఠాలు లోకులు చేసి లాలుకు కిస్తీలప్రకారము సరకారు రూకలు కట్టుతూ వుంటారు.

ఈదేశాస్థులకు బహుమందికి అర్ధలోభము చాలాకలిగి సుషుప్తి కాలాలలో యిండ్లమీద పడి మనుష్యుల అర్ధప్రాణాలు హరింఛే బుద్ధులు పుట్టడముచేత మల్లడియనే వింతజ్వరము యీశ్వరుడు వీరి శిక్షనిమిత్తము ఈ దేశాములో పుట్టించి లక్షావధి ప్రజలను యీలోకము వదలపెట్టినట్టు తోచుదున్నది. అయితే అందులో సాధువులుకూడా కొందరు లయించి యుందురే అని శంక తోచితే అందుకు సమాధానము, ఏక, పాపాని కురుతే ఫలం భుంజ్తే మహాజన,, అనే వచనము. యీ వచనానకు దృష్టాంత మేమంటే వొకగురువు, వొక శిష్యుడున్ను సముద్రతీరమందు సంచరింపు చుండగా వొకగొప్పవాడ ముణిగి పోయినది. శిష్యుడుచూచి అనేకవేల జనము వాడతోకూడా ముణిగి పోయినదిగదా యిందుకు కారణమేమన గురువును అడిగినాడు. గురువు ఆవాడలో ఒక పాపిష్ఠుడు వుండబట్టి వారిగతి అట్లా అయినదని చెప్పినాడు. శిష్యుడు యింత అన్యాయము యీశ్వరుడు చేయవచ్చునా?

వొకపాపి నిమిత్తము వెయ్యింటిని చంప నిచ్చయించడము యుక్తమా అని ప్రశ్నచేసినాడు గనుక గురువు అందుకు మౌనధరుడై యుండేను. కొంతమేర యీశిష్యగురువులు వెళ్ళేలోపలనే సుర్ణ రేఖలు గల వొక సుందరమయిన దక్షిణివర్త శంఖము శిష్యునికి ఆ సముద్రతీర మందు దొరికి నంతలో యెత్తిపూజ్యముగా వక్షస్థలమందు ధరించినాడు. ఆ శంఖములోపల అనేక లక్షల చీమలు శంఖములోని మాంసము భక్షించేకొరకు పుట్టపెట్టి వుండినది. ఆ సమూహములోని ఒక చీమ బయిలువెళ్ళి శిష్యుణ్ణి కరవగానే శిష్యుడు ఆ శంఖముతీసి అందులో చీమల గుంపు చూచి దాన్ని విశిరిపుచ్చి సముద్రములో పడవేసినాడు. యీనడితి గురువుచూచి యేమబ్బా వొకసాఫీనిమిత్తము వెయ్యింటిని యీశ్వరుడు వాడతోకూడ సముద్రములో ముంచినందుకు యీశ్వరుణ్ని దూషించితివే, వొక చీమ నిన్ను కరిచినందుకు అనేకలక్షల చీమలు చచ్చేటట్టు యేల మంచిశంఖమును న్యాయ క్రమ మెరిగిన నీవు సముద్రములో పడవేస్తివని అడిగినాడు.

యీదినము నడిచినదారి దట్టమైన అడివిమధ్యేవున్నది. వెదుళ్లు విస్తారముగా యీఅడివిలోవున్నవి. బురంపూరు మొదలుగా పర్వతసమూహాలు దారికి కుడిపక్క సమీపమందే వున్నవి. జగన్నాధము మొదలుగా భూమి సముద్రతీరమై యిసకైనందున ముంతమామిడి చెట్లు ముంతమామిడిపప్పున్ను ఈ ప్రాంతాల వెశేషముగా కలవు. చెన్నపట్ట్సణము వదిలినవెనక ఈ చెట్లున్ను తమిదె పయిరున్ను చూచిన వాడనుకాను. గంజాం మొదలుగా బురంపురమువరకు భాట పశ్చిమాభిముఖముగా వచ్చి యిచ్చాపురము మొదలు కొండలకిందుగా దక్షిణాభిముఖ మవుచున్నది.

యీదేశములో కర్ణాలు తక్కువజాతివారు. బ్రాహ్మణవేషధారులు వారిని శిష్టుకరణాలంటారు. వేశ్యాస్త్రీలను సాండీ లంటారు. బ్రాహ్మణాగ్రహారప్రవత్రకులను భుక్తు లంటారు. శూద్రగ్రామ ప్రవర్తకులను నీయిం డ్లంటారు. తలారులను చారకు లంటారు. పల్సాళిలో అంగళ్ళు వున్నందున సమస్తపదార్ధాలు దొరికినవి.

యిక్కడ వంట, భోజనము కాచేసుకొని యిక్కదికి ఏడు కోసుల దూరములో నుండే రఘునాధపుర మనే గొప్పవూరు రాత్రి తొమ్మిది గంటలకు చేరినాను.

దారి వుదయాన నడిచినంత వసతికాదు. అంత దట్టమయిన అడివి ఇరుపక్కల లేదు. కొండలుమాత్రము దారికి సమీపముగా వున్నవి. దారిలో కొత్తాగ్రహార మని వొకవూరు వుండగా దానివద్ద కొంతసేపు ఆసోదా చెసుకొని అక్కడి బ్రాహ్మలను పూజించి సాగివచ్చినాము.

రఘునాధ పురములో యిక్కడి జమీదారుడు వొక గొప్ప గుడి రెండు అంతస్తులుగా కట్టి రాధాకృష్ణులను ప్రతిష్టచేసి పూజ నైవేద్యాలకు వసతులు యేర్పరచి బైరాగుల అధీనము చేసియున్నాడు. బ్రాహ్మల యిండ్లున్నా రాత్రి అయినందున స్థలము విచారించుకోలేక ఆగుడివద్ద దేరాలు వేసుకొని దిగి రాత్రిభోజనాలు మొదలయినవి గడిపినాను. గుడి మహాసుందరముగానేవున్నది. యీవూరిలో సమస్తమయిన పదార్ధాలుకలవు. మా డేరాలవద్ద అంగళ్ళు తెచ్చి వేయించి కావలసిన సామానులు తీసుకొన్నాము.

తేది ఉదయాత్పూర్వము నాలుగు గంటలకు లేచి యిక్కడికి అయిదుకోసుల దూరములో నుండే హరిశ్చంద్రపురము పదిగంటలకు చేరినాము. దారిలో కంపెనీవారి వేశిన లయను చుట్టు గనుకనున్ను, ఆ లయను మిట్టాపల్లాలుగా వున్నది గనుక, చిన్నగ్రామముల మీద పొయ్యే పూర్వము కలిగివుండే దారే యిప్పటికి నడుస్తూ ప్రసిద్ధి కలిగి వున్నది. అయితే లయనుదారి అనే మాటమాత్రము వొకటి యిక్కడా వినికిడిలోకి వచ్చియున్నది.

ఈవూరు నలభై యిండ్ల బ్రాహ్మణాగ్రహారము. గంజం మొదలుగా బ్రాహ్మలలో వెలనాడు, కాసరనాడు, నియ్యోగు లనే వ్యస్థలు కద్దు. యీ అగ్రహారాల కన్నిఛికి జమీనుదారులు భూవసతులు చేసి వున్నాదు. హరిశ్చంద్రపురములోను అంగళ్ళున్నవి. సమస్త పదార్ధాలు దొరికినవి. బ్రాహ్మణయింట్లో దిగి వంట భోజనములు కాచేసుకొని నాలుగుగంటలకు బయిలువెళ్ళి యిక్కడికి మూడు కోసులదూరములోనుండే నరసన్నపేటవద్దవుంఛే రావులవలస అనే వూరు ఆరుగంటలకు చేరినాము. దారి పొడిచెట్లు అడివి. కాలిబాట రేగడభూమి.

యీవూళ్ళో కొరివి రామన్నపంతులు అనే జమీందారుడు నివాసము చేయుచూ వచ్చినాడు. వారియింట్లో దిగినాము. అంగళ్ళు వూళ్ళో లేకపోయినా నాపరివారానకు కావలసిన బియ్యము పప్పు యావత్తు ఆ జమీందారుగారు యిచ్చినారు గనుక రాత్రి సుఖోపాయముగా గడిచినది.

మధ్యాహ్నము దిగినవూరు మొదలుగా నరసన్నపేటవరకు రాత్రిళ్ళు నిద్రలేదని గ్రామస్థులు చెప్పుతూవచ్చినారు. దానికి కారణమేమంటే యిక్కడి జమీందారుడు కొన్ని బందిపోట్లకు ఆధారభూతుడైనందున సరుకోటు, Circuit, విచారణకు పెట్టినారట. ఆ కోర్టువారు పూర్తిఅయిన రుజుకాలేదని అతణ్ని వదిలినారట. యిప్పట్లో నామీద సాక్షి చెప్పినవారి వూళ్ళన్ని కొళ్లపెట్టి తగలపెట్టుతానని పౌరుషము పులికి వున్నాడట. అందునిమిత్తము నిద్రలేక బాధపడుతున్నామని చెప్పినారు. జగన్నాధములోను వొకసంగతి వినడములో యిదేప్రకారము హయిదరాబాదునుంచి ధర్మరూకలు తెచ్చే గుమస్తాలను యీదారిలో చంపినందుకు చచ్చినవాడివద్ద వున్న సామానులు కొన్ని దొంగలవద్ద దొరికిన్ని వారిని సరుకోటువారు వదిలినట్టు పండావాండ్లు చెప్పినారు. విజయనగరపు రాజు కాశిలో యిదే ప్రకారము దొంగలను సొమ్ముతోకూడా పట్టిన్ని సరుకోటువారు వదులుతారు గనుక నేను నిభాయించ లేక రాజ్యము కలకటరు అధీనము చేసి కాశీనివాసము చేస్తానని చెప్పినాడు.

యింగిలీషువారి న్యాయమేమంటే, పదిమంది దొంగలు శిక్షలేక తప్పిపోవడము మంచిది గాని, సందేహముమీద వొకగృహస్థుడు దండనకు లోబడడము యుక్తము కాదని లలితముగా న్యాయవిచారణ చేస్తారు. యీదేశములో చూస్తే వొకదుష్టుణ్ని రక్షిస్తే వెయిమంది శిష్టులను శిక్షించినట్టు అనేమాట ప్రత్యక్షముగా వున్నది. యెట్లానడిస్తే చెడ్డదో యీ ధర్మసూక్ష్మము తెలియడానకు యీశ్వరుడు సమర్ధుడుగాని యీశ్వరజ్యోతి దీప్తిగా ప్రకాశించే ప్రకృతి జనులు శక్తులు కారు.

రావడముచేత కొన్నికొన్ని తావులలో పశ్చిమాభిముఖముగా వెళ్ళిమళ్ళీ దక్షిణాభిముఖముగా వచ్చుచున్నది.

యీ శ్రీకాకుళము బలరామక్షేత్రమని ప్రసిద్ధి. యీస్థలమహత్యము స్కాందపురాణాంతర్భూతమయిన కూర్మపురాణములో ముప్పై అధ్యాలలో విస్తరించియున్నదట. యీవూరి వోరగా, లాంగూలనది అనే పేరుకల నది వొకటియున్నది. యీవూళ్ళో వీధులు నడమ ప్రవాహకాలాలలో నదిసంబధమైన వుదకము ప్రవహిస్తూ వుంచున్నది గనుక యిండ్లు పురుషప్రమాణము మిట్టవేశి ఆ మిట్టలమీద కట్టుకున్నారు. నదీతీరమందు కోటీశ్వరుడనే శివస్థల మొకటి పురాణసిద్ధమయినదిగా వున్నది. యీవూళ్ళో బ్రాహ్మణ గుజరాతి వాండ్లు నలభై యిండ్లవారు రత్న వ్యాపారసాహుకారు పనులు చేయుచున్నారు. సమస్తమయిన పనివాండ్లు వున్నారు. యీవూళ్ళో ఎనిమిది తేది పర్యంతము వెనక దిగబడిపోయిన బండ్లను కలుసుకొని వెరే బండ్లు యిక్కడ టీకా చేసేకొరకు నిలిచినాను. బండి ఒకటి కి బురంపూరు నుంచి యిక్కడికి కూలి రూపాయిలు డెబ్బై నాలుగు, యిక్కడినుంచి విజయనగనానకు బండి ఒకటి కి రూపాయిలు నాలుగు చొప్పున నిష్కర్ష చేసినాను.

తేది వుదయమయిన ఐదు గంటలకు లేచి యిక్కడికి అయిదు కోసుల దూరములో నుండే వెజ్జపురం తొమ్మిది గంటలకు చేరినాను. యీ వూళ్ళో నాలుగు బ్రాహ్మణయిండ్లు వున్నవి. అంగళ్ళు కలవు. సమస్త పదార్ధాలు దొరుకును. ఆరునెలలుగా వర్షము లేక నిన్నరాత్రి మంచివర్షము కురిసినది. దారిలో యెక్కడచూచినా మడకలుకట్టిదున్నుతూ వున్నారు. శ్రీకాకుళము నుంచి విజయనగరానకు రెండుమూడు మార్గాలు వున్నవి. అందులో యీ మార్గము సమీపమనిన్ని, వసతి అనిన్ని తెలిసినది. యీవరకు నడిచిన దారి యిసక కలసిన రేగడ. నిండా మిట్టాపల్లాలు లేవు.

విజయనగరపురాజులు సంగీతసాహిత్య ప్రియు లయినందున కొందరు భోగస్త్రీలకు సంగీతరత్నాకరం భరతశాస్త్ర ప్రకారము శిక్ష చేప్పించి తయారు చేయించినారు. వారు కొందరు శ్రీకాకుళము వచ్చి వుండగా చింతా జగన్నాధ పంతులు నిన్నరాత్రి వారి విద్యాప్రకట యిక్కడ విజయనగరపు రాజు గురువు వశిస్తాడు. యీ రాజుయొక్క పూర్వీకులు వైష్ణవ మతస్థులయి దక్షిణదేశ సంచారము లోగడ చేసినందున శానామంది వైష్ణవులను ఈ దేశానకు పిలుపించి ఈ రామతీర్ధాలలో ప్రవేశపెట్టి వారికి పుష్కలమైన భూజీవనాలు యిచ్చినారు గనుక వారు సంతోషముగా యీ రాజ్య్హములో వశింపుచున్నారు. ఈ విజయనగరము యిప్పటి రాజుల పూర్వీకుల కింద రెండు వందలు నలభై సంవత్సరములు గా వున్నట్టు తెలిసినది. ఈదేశము దేవబ్రాహ్మణ సమాగమద్వారా వంద సంవత్సరములుగా నిండార్లుగా కర్మభూమి అయినట్టు తోచినది. యీ బస్తీలో రాజు వశించే చిన్న కోట వొకటి వున్నది. కోటవలిగా యెయ్యిండ్లు కలవు. సమస్తమయిన పనివాండ్లు వున్నారు. బంగారుమీద పోగరపని చేసేవాండ్లు ఘట్టివాండ్లుగా శానామంది వున్నారు. సుందరమైన పాత్రసామానులు చేయగల కంచర వాండ్లున్ను, మంచి బట్ట నేసే నేతగాండ్లున్ను వున్నారు.

యిక్కడి రాజు రాజ్యము విశాఖపట్టణపు కలకటరు అధీనముచేసి కాశీ వాసము సహాకుటుంబముగా చేసుట ఛేత యీ రాజ్యనివాసులు తల్లిని కానని బిడ్డలవలెనే తల్లడింపుచున్నారు. యీ మొర ఆలకించగా హిందువులకు వర్ణాశ్రమధర్మముల ప్రకారము సమస్త తారతమ్యములు తెలిశిచేసే దొరతనమే మిక్కిలీ అనుకూలముగ తోచబడుచున్నది. యిక్కడి రాజు అయిన నారాయణబాబు ధనసంగ్రహ మయిన జాగ్రత విశేషముగా పెట్టక అప్పులపాలైనా ప్రజలవల్ల స్తుతి చేయబడుచున్నాడు.

యీ వూళ్ళొ బోయీలు బండ్లు మార్చుకునే నిమిత్తము సోమవారమంతా గొపాలస్వామి మఠములో నిలిచినాను. యీవూరి యిండ్లు యథోచితముగా బాగానే కట్టియున్నవి. రాజవీధులు మాత్రము విశాలముగానే కట్టియున్నవి. యీ సోమవారము జగన్నాధములో రధోత్సవము గనుక యెవూళ్ళోనున్ను ఒక జగన్నాధస్వామి గుడి వుండగా అక్కడ రథోత్సవము బహువిభవముగా జరిగినది. యీ రాజ్యము తొమ్మిది లక్షల రూపాయల దని పేరు. రెండు లక్షల యెత్తుతున్నది. సాలుకు నాలుగు లక్షలు కంపెనీవారికి కట్టవలశినది. దేవాదాయము బ్రహ్మా


ఇరువదిమూడవ ప్రకరణము  గంజాము నుండి రాజమహేంద్రవరము

దాయము యీరాజ్య్హములో రెండు లక్షల దాకా వుండేటట్టు విన్నాను. యిక్కడానున్ను బందిపోటు వుపద్రవము చెన్నపట్టాణములో వారంటు తియ్యడాలు జడిజీకోటుకు యీడ్చడాలవలెనే వొకరి మీద వొకరికి కోపమువస్తే నిమిషములో జరిగింపుచున్నారు. ఆదివారము రాత్రి నేను దిగిన వూళ్ళో వొక బిందువు పడకపోయినా విజయనగరములో అమితమయిన వర్షము కురిసినది.

తేది వుదయాత్పూర్వము మూడు గంటలకు లేచి యిక్కడికి ఆరు కోసుల దూరములో వుండే ఆలమంద యనే వూరు రెండు గంటలకు చేరినాము. యీ విజయనగరము దేశపు బోయీలు బాగా నడుస్తారు. చెన్నపట్టణములో పల్లకీసవారీలయొక్క షోకు బహుశా అందరికి కలిగి వున్నందున గంజాము మొదలుగా వుండే బోయీలందరు చెన్నపట్టణము వచ్చుచున్నారు. చెన్నపట్టణములోనుంచి నాతోకూడా యాత్రవచ్చిన యాత్రబోయీలలో కొందరు యిండ్లు బురంపురము వద్ద వున్నందున వారు శలవుతీసుకొని వెళ్ళినారు.

నేను కన్యాకుమారి మొదలుగా కాశ్మీరమువరకు సంచరించిన ప్రదేశములలో వుప్పాడ బోయీలకు సమానమైన మోతగాండ్లు, చూపరులు, బలాఢ్యులు, అలంకారప్రియులు, ప్రయాసకు వోర్చగల వారు, బంట్రౌతుమానాగా ఆయుధధారణప్రియులు యెక్కడా వున్నట్టు తోచలేదు. అయితే దేశముకాని కొన్నిదేశాలకు వస్తే యీ వుప్పాడ బోయీలకు దేహదార్ఢ్యము తప్పి రోగిష్టులొవుతారు. వారిని జాగ్రత్తగా కాపాడుచూ వారి దేహములు వొచ్చిన కాలమందు ఆయా దేశస్థులయిన బోయీలతో పనిగడిపి వీరిని తీసుకొనివస్తే యీ వుప్పాడ బోయీలతో భూగోళ సంచారము యావత్తూ చేయవచ్చునని తోచుచుచున్నది. పాలకీలు మోశే వృత్తికి యీ వుప్పాడదేశస్థులనే ఈశ్వరుడు తగినవారినిగానే నియమించినట్టు తోచబడుచున్నది. అయితే వీరు మాంస, మద్య, మత్స్యప్రియులు మిక్కిలి అయినంచున వీరు తాగినప్పుడు తమలో రాము పోట్లాడితే పోట్లాటలు ఖామందుల మనసున నిండా నొప్పిచేస్తున్నది.

నేడు వుదయాన నడిచినదోవ కంపెనీలయను దారి కిరుపక్కలా చెట్లుమాత్రము పెట్టి యండాకాలములో వాటికి నీళ్ళు పోయడానకు మనుష్యులను వుంచుతారు. వర్షాకాలము రాగానే ఆ మనుష్యులను తీసివేయడమువల్ల పెట్టినచెట్లు అదృశ్యమయి మళ్ళీయివతలి సంవత్సరానకు కొత్తచెట్టు పేట్టవలసి వున్నవి.

యీ రాజ్యములో వీరభద్రరాజు యనేవాడు తనకు కావలశినంతా నారాయణ బాబుగారి కార్యస్థులు యివ్వలేదని కొళ్ళగాండ్లను కొలువు పెట్టించి మనుష్యులను హింస చేయుచున్నాడు గనుక నేను బురంపురములో కొలువు పెట్టిన ఆరుగురు బంట్రౌతులు శ్రీకాకొళమునుంచి కోటునజీరు తయినాతి పంపించిన ముగ్గురు జవాన్లు గాక నారాయణబాబుగారి ఫౌజు సంబంధ మయిన పదిమంది శిఫాయిలను కూడా తెచ్చినాను. ఆలమందలో విజయనగరమురాజు నారాయణబాబుగారి షడ్డకుడు వాసము చేస్తాడు. పది బ్ర్రాహ్మణయిండ్లున్నవి. సమస్తమైన పదార్థాలు అంగళ్ళు కలవు గనుక దొరుకుచున్నవి. యిక్కడ వర్ష ప్రతిబంధముఛేత యీ వూళ్ళో యీరాత్రి వసించినాను.

తేది వుదయాత్పూర్వము మూడు గంటలకు లేచి యిక్కడికి ఆరు కోసుల దూరములో వుండే సబ్బవర మనే వూరు రెండు గంటలకు చేరినాను. దారి బహు దొంగల భయము. కొండలు, అడివి దారి కిరుపక్కలా వున్నవి. కొంతదూరము రాతిగొట్టు తతిమ్మాదారి కొంతదూరము యిసకపొర, కొంతదూరము రేగడాభూమిగా నున్నది. ఆలమంద అనే వూరికి సమీపమందు అరణ్యము మధ్యే కొండమీద పర్మనాభమనే స్థలము వున్నది. పురాతన ప్రతిష్టగాని అనాదిపురాణ సిద్ధముకాదు. అక్కడ మానుషసంచారము విస్తారములేదు. సబ్బవరమనే వూళ్ళో వెన్నకోటివారు వొక గ్రామము విజయరామరాజువద్ద సంపాదించి వొకపాలు అగ్రహారానకు వృత్తులు చేసి మరివొక పాలు అన్నసత్రానకు వొదిగేటట్టు నిశ్చయము చెసి వొక అన్న సత్రము కట్టి మరివొకపాలు తమ వంశస్థుల అనుభవానకు వుంచినాడు గనుక అతని వంశస్థుడైన రవణప్ప ఆ సత్రము లోకోపకారముగా బహుచక్కగా నడిపింపుచున్నాడు. యీ దినము మేము కొంచము తడిశినందున యీ రాత్రికూడా నిలిచినాను. యీవూళ్ళో వచ్చిన సమస్తజాతిపాంధులకు కావలసిన భోజనసామానులు యీ సత్రములో బలవంతముచేసి కావలిస్తే పక్వాన్నముగాకూడా పెట్టుతారు. అంగళ్ళు విచారించనక్కరలేదు. నలభై బ్రాహ్మణయిండ్లున్నవి. మంచి వసతైన గ్రామము.

యీవూరికి రెండుకోసులదూరములొ సింహ్వాచల మనే మహా స్థల మున్నది. ఆ గుడిఖర్చుకు సాలుకు పది వేల రూపాయిలు తగులు చున్నవి. యీ ధర్మము విజయనగరపురాజు పరిపాలనఛేయుచున్నాడు. యీస్థల మహాత్మ్యము ప్రహ్లాదుణ్ని తండ్రిదండనవల్ల నివర్తింప చేసి కాపాడిన అవసరము. యీ మూర్తి పేరు వరాహ నరసింహమూర్తి. అనేక జలధారలు స్రవింఛే పర్వతము మీద వరాహాకృతిగా ఆ మూర్తి వొకమందిరములో వసించివున్నాడు. రెండు వందలు వైష్ణవుల యిండ్లు యీ స్థలమందున్నవి. రాజోపచారములతో యీ మూర్తిని ఆరాధింపుచున్నారు. అక్షతదియతప్ప మరియేదినము ఆ మూర్తి దర్శనములేదు. తతిమ్మా దినాలు చందనముచేత ఆ మూర్తిని కప్పివుంటారు. యీ మూర్తియొక్క ధాన్యశ్లోకము యీ అడుగున వ్రాయుచున్నాను. శ్లోక, త్రాహీతి వ్యాహరంతం త్రిదశా రిపుసుతం పాతుకామ స్స్వభక్తం ı విస్రస్తం పీతవస్త్రం జిజకటియుగళే నవ్యహస్తే గృహ్ణన్ ı వేగశ్రాంతం నితాంతం ఖగపతి మమృతం పాయయ న్యస్స్వపాణౌ ı సింహాద్రౌ శీఃఘ్రపాతక్షితినిహితపద, సాతుమాం నారసింహ, యీ శ్లోకమే యీస్థల మాహాత్మ్యానకు సంగ్రహమని తెలియవలసినది.

తేది వుదయాత్పూర్వము మూడు గంటలకు లేచి యిక్కదికి ఏడు కోసులదూరములో నుండే కసంకోట అనేవూరు తొమ్మిది గంతలకు చేరినాను. దారిలో అనకాపల్లి హనే మజిలీవూరు వున్నది. పోలీసు అమీనున్నునలభై యిండ్ల బ్రాహ్మణాగ్రహారమున్ను కలది. దారి నిన్నటివలెనే భయోత్పదములయిన మన్యాలు యిరుపక్కలా కలిగివున్నవి.

కనంకోట యనే వూరు గొప్పదేను. అన్నిపదార్ధాలు దొరికేపాటి అంగళ్ళు కలవు. బ్రాహ్మణ యిండ్లలో వంట, భోజనము కాచేసుకుని వొక గంటకు బయిలుదేరి యిక్కడికి యేడుకోసులదూరములో నుండే యలమంచిలి యనే వూరు ఏడు గంటలకు చేరినాను.

నేటి మధ్యాహ్నము దారిలో వ్యాఘ్రభయాలుకూడా కద్దు. యిది మజిలీవూరు అయినప్పటికిన్ని దారి వొత్తి వొకకోసుదూరములో వుండే దివ్యల అనే గ్రామ నివాసి యయిన భాగవతుల కిత్తన్న యెదురుగా వచ్చి తన వూరికి రమ్మని ప్రార్థించినందున ఆ వూరు ఏడు గంటలకు ప్రవేశించి ఆరాత్రి ఆ మరునాడు శుక్రవారము వర్ష ప్రతిబంధముచెత నిలిచినాను. యీ వూరు వంద యిండ్ల అగ్రహారము. అందరు ఉపపన్నులు అయినప్పటికిన్ని వొక యతిశాపముచేత పెంకుటిండ్లు కట్టక పూరియిండ్లల్లో కాపురము చేయుచున్నారు. యీ వూళ్లో వుండే బ్రాహ్మణులందరు వేదపారంగతులు. కిత్తయ్య యనే వారు జమీౝదారుడున్ను, మంచి సాంప్రదాయికుడున్ను. యీ వూళ్ళో అంగళ్లు కలవు. అన్ని పదార్ధాలు దొరుకును.

తేది వుదయాత్పూర్వము నాలుగు గంటలకు లేచి యిక్కడికి ఐదు కోసుల దూరములో నుండే నక్కపల్లి వుపమాకా యనే వూళ్లు తొమ్మిది గంతలకు చేరినాను. దారి కొంత వెల్లడిగా వున్నది. కొంతదూరము యిసకపరగానున్ను, కొంతదూరము రేగడగానున్ను వున్నది. వుపమాకా యనే వూళ్ళో వొక చిన్నకొండమీద వెంకటాచలపతి గుడి వున్నది. యాభై యిండ్ల వైష్ణవాగ్రహారము ఆ గుడిని నమ్ముకుని వున్నది. వెంకటాచలపతిపేరు ప్రసిద్ధి. యీవూరు మొదలుగా దక్షిణదేశములో కలిగివున్న దని తెలియవలసినది. ఆకు తినే మేకల మందలు పొలాలలో విశాఖపట్టణముతోచేరిన విజయనగరపు రాజ్యము సరిహద్దు మొదలుగా చూస్తూవస్తాను. జగన్నాధము మొదలుగా యేదలనే యెనుములు పోతులు విస్తారము కలవు.

విశాఖపట్టణము జిల్లా సాలుకు పద్నాలుగు లక్షల రూపాయిలు యెత్తుచున్నది. భూమి యావత్తు జమీౝదారుల అధీనముగాని కలకటరు అమానీ విచారణలో యేమాత్రమున్ను లేదు. జమీౝదారులకు యీ జిల్లాలో వంద కి ఇరవై నాలుగు వంతున లాభమువచ్చును. అయినా బందిపోట్లవల్ల నిండా నొచ్చిపోవుచున్నారు. నక్కపల్లి, వుపమాకా యనే వూళ్ళున్ను చేరినట్టుగానే యున్నవి. మధ్యే వొక చెరువుకట్టకద్దు. వుపమాకాలొ వొక శివమందిరమున్ను, దానిలో చేరినట్టు వొక సత్రమున్ను వుండగా అందులో దిగినాను. నక్కపల్లెలో అన్ని పదార్ధములు దొరుకును.

యీ దేశపు స్త్రీలు మంచి సౌందర్యము కలవారుగానున్ను, ముఖలక్షణము కలవారుగానున్ను అగుపడుతారు. జాఫరావిత్తుల వర్ణముచేసిన బట్టలు వుపపన్నులు కట్టుతారు. కాళ్ళకు పాడగాలు వెయ్యడము కలిగివున్నది.

సర్వసాధారణముగా యీ దేశమందు తెనుగుభాష ప్రచురముగా వున్నది. మాటలు దీర్ఘముగానున్ను దేశియ్యమయిన శబ్దహ్రస్వముగానున్ను పలుకుతారు. తెనుగు అక్షరములు గొలుసుమోడిగా వ్రాస్తారు. మనుష్యులు స్వభావమూఅ దౌష్ట్యములు చేయతలచినా మంచితియ్యని మాటలుమాత్రము వదలరు. యేపనిన్ని వూహించి చేస్తారు. యీ వూళ్ళో రాయవరపు మునిషీ కోటూరు వీరరాఘవమొదిలిని కలుసుకొనే నిమిత్తము యీ రాత్రికూడా నిలిచినాను.

తేది వ్దయాత్పూర్వము మూడు గంటలకు లేచి యిక్కడికి నాలుగు కోసులదూరములో వుండే తుని యనే వూరు ఏడు గంటలకు చేరినాను. యీవూరివద్ద తాండవ మనే నది వొకటి, కసంకోటవద్ద శారదా అనే వది వున్నట్టె వొకవాగున్నది. యీ తాండవనదికి అవతలిపక్క రావుపేటాయనే వూరు వొకటి వున్నది. అక్కడ తపాలాఆఫీసు రయిటరు వొకడు ఆఫీసును వుంచుకుని వున్నాడు. ఈ రెండువూళ్ళుగొప్పబస్తీలు. యిక్కడ హేడ్డాపోలియను వసముచేయుచున్నాడు. సమస్త పదార్ధములు దొరుకును. యీవూరినుంచి రాజమహేంద్రవరానము కంపెనీవారు వేసిన లయను దారి మన్యాలమీద వేరేచీలి పెద్దాపురము, పిఠాపురముల నిమిత్తము లేకపోవుచున్నది. ఆ దారి వొక ఆమడ సమీపమయినప్పటికిన్ని, బండ్లదారి అయివున్నా నాతొకూడా చెన్నపట్టణమునుంచి వచ్చిన బోయీలయిండ్లు పిఠాపురపుదారిలో వున్నందున వారి సంతోషనిమిత్తము ఆ దారివళ్ళ నిశ్చయించినాను. యీ మధ్యాహ్నము నడిచినదారి బహుదూరము రేగడ, అడివి నిండాలేదు. దారి కిరుపక్కలా కొంతదూరములో చిన్నకొందలు వుండివున్నవి.

గంజము మొదలుగా అన్ని యిండ్లలో యర్రమన్ను గోడలకు పూశి సున్నపుచుక్కలు నాలుగైదు అంతస్తులుగా బారుతీర్చి వుంచుతారు. కడపలకు పసుపు కుంకుమ వుంచుతూవస్తారు. విజయనగరము మొదలుగా రనచెక్కలని కాచు కలిపి నిండు, చిన్నపోకలను వుడకపెట్టి వక్కలుగా అమ్ముచున్నారుగాని యీవరకు కనుపడుతూవచ్చిన పోకలు విశేషము లేవు. చుట్టలు తాగడము విశేషము.

యీవూరునుంచి బండ్లను రాజానగరములో నున్ను కలుసుకునే టట్టు పంపించి యిక్కడ బ్రాహ్మలయిండ్లలో వంట, భోజనము కాచేసుకుని రెండు గంటలకు బయిలుదేరి యిక్కడికి నాలుగు కోసుల దూరములో వుండే వంటిమామిడి యనే వూరు ఆరు గంటలకు చేరినాను. యీ వూరు చిన్నది. అయినప్పటికిన్ని యిప్పుఛు కోటీత్రియంబకరాయని వారు నడిపించే సదావృత్తి అన్నసత్రము వొకటి విశాలముగా కట్టివున్నది. అంగళ్ళు కలవు. సమస్తమయిన పదార్ధములు దొరికినవి. యీ వూళ్ళో యీ రాత్రి వసించినాను.

తేది వుదయాత్పూర్వము నాలుగు గంతలకు బయిలువెళ్ళి యిక్కడికి తొమ్మిది కోసుల దూరములో నుండే నగలాపల్లె అనే వూరు పది గంటలకు చేరినాను. తుని మొదలుగా దారి దక్షిణాభిముఖముగా వచ్చినందున కొండలు దూరమై సముద్రము దగ్గిర అవుతూవచ్చినది. కన్యాకుమారి మొదలుగా కలకత్తావరకు యీభూమిగడ్డను సోగతమలపాకు అందమయ్యేటట్టు సముద్రము ఆవరించి వున్నందున మనము దక్షిణాభిముఖముగా వఛ్ఛే కొద్ది సముద్రతీరానకు సమీపముగా రావడమైనది. గంజాం మొదలు సముద్రతీరమందే వచ్చేటట్టు చెన్నపట్టణమునకు వొక బాట వున్నది. ఆభాట సమీపమయినా వుప్పుకాలువలు అనేకముగా దారిలో దాటవలసి వున్నది గనుక ఆమార్గము నుంచి కంపెనీవారు పడమరవొత్తి శాలవేసినారు. సముద్రతీరువు భలేను వుప్పుకటారులు త్రిరోదయం యెటున్నదో అటువంటి దారిని అడివి, కొండలు, పులులు, రాళ్ళు, దొంగలు వీండ్ల భయము చాలా కలిగివున్నది. యీ దినము నడిచినదారి యెడారి. కొంతమేర అడుసు నీళ్ళుగా వున్నది. నాగలాపల్లెవూరి ముందర వొక వుప్పు కాలువ వున్నది. దానికి పాటు పోటు కద్దు. పోటువేళ దానికి సంగడి అని రెండు తాటిచెట్లును దోనువలెనే తొలిచి చేర్చి కట్టివుంటారు. అందులో ఆరుగురు యెక్కవచ్చును.

నాగలాపల్లె అనేవూరు పెద్దది కాక పోయినా అన్ని పదార్ధములు దొరుకును. యిక్కడి వుప్పుకాలువ వద్ద చెన్నపట్టణములో వుండే వొక పెద్దమనిషే యీ దేశస్థుడి బోధన మీద్ పదివేల రూపాయలు ఖర్చుపెట్టి రెండుతాటాకు గుడిశలు వేసి రెండునీలిమందుచేసే తొట్లుకట్టి వొకబావి తొవ్వించినాడు. నీలిమందు లాభముయొక్క భ్రాంతి చెన్నపట్టణపు వారిని బహుశా యీరీతుగా ముంచినది. యీ వూరికి యానాం నీలపల్లి అనే గొప్ప బస్తీలు మూడు ఆమడలోవున్నవి. యింజరమనే గ్రామము నీలపల్లికి సమీపముగా వున్నది. మాదయాపాళెము యానానికి ఆమడదూరములో నున్నది. యీవూరికి కాకినా డనే కలకటరు నివాసస్థలము ఏడు కోసుల దూరములో వున్నది.

వుప్పాడా అనేవూరు యిక్కడికి కోసేడుదూరములో నున్నది. వుప్పాడాకు చుట్టూ ఆమడదూరములో సముద్రతీరమందు సుమారు యేనూరు యిండ్ల బోయిజాతివారు గుడిసెలు వేసుకొని కాపురమున్నారు. వీరికి పయిరు భూమి యిలాకా యెంతమాత్రములేదు. సముద్రములో మత్స్యములి పట్టి యెండవేశి మణుగు ఒకటి కి కొంగము తీరువ యిచ్చి అమ్ముకోవడమున్ను చెన్నపట్టణములో కొలువుకొలిచి బ్రతకడమున్ను. వీరియిండ్లలో మొగవాడు పుట్టితే చచ్చేవరకు తల ఒకటి కి ర్పూ పద్నాలుగు సరకారువారికి తీరువ యివ్వవలసినది. వీరి గుడిశలు నాలుగు రూపాయలకు యెక్కువచేయవు. యీబోయస్త్రీలు కట్టెలుకొట్టి అమ్మడమువల్లనున్ను, పైరుపెట్టే సంసారులకింద పనిపాటులు చేయడామువల్లనున్ను, వన్యములైన కూరకాయలు తెచ్చి అమ్మడమువల్లనున్ను కాలక్షేపముచెయుచు మొగవాండ్ల నిమిత్తము సరకారుకు యివ్వవలసిన పన్నుసహా యిచ్చుకుంటారు. మొగవాండ్లు రూపాయి ఒకటి కి నెలంతా ఆరు యింటికి పావులావంతున వడ్డీకి అప్పుతీశి సారాయి మొదలయిన మత్తద్రవ్యములు తాగి ఆ అప్పులు మిక్కటమయితే తీర్చడానకు దేశాంతరములకు జతలుగా కలిసివచ్చి బోయీకొలువుచేసి మళ్ళీ దేశమునకు వచ్చి చేసియున్న అప్పులు తీర్చుకుంటూవుంచున్నారు. కొందరు బైటిసంపాదనకూడా తాగడానకు చాలక స్వదేశగమనమే పదిపదిహేనుయేండ్లు తలుచుకోకుండా వుంటారు. నాతోకూడావచ్చిన బోయీలలో యిద్దరు యీ దేశము వదిలి బహుకాలమౌటచేత వారి భార్యలు వారిని గుర్తుపట్టలేకపోయినారు. ఆ యిద్దరిని వారి యిండ్లస్త్రీలు మాకు తాగడానకు మేము కావలసినది యిస్తాము, యికమీరు దేశమువదలి పోవద్దని బతిమాలుకొనుచున్నారు.

యీ మత్తద్రవ్య పానమువల్ల లోకులకు యింత ఆసక్తియేల కలిగినదో అది యీశ్వరునికే తెలుసును. అయినా నాకు తోచడము యేమంటే యేలే బుద్ధి యనే రాజుయొక్క అధికారమునకు లోబడని దేహములోని మనసు మృతముయొక్క చేష్టలతో తిరుగులాడుచూ వుంచున్నది. గనుక ఆ మనసు యీషణత్రయబద్ధ మయి స్వప్నావస్థలోకూడా యీషణాదులను గురించి కలిగే విరోధములు అబద్ధములని జాగ్రదవస్థలో తెలిశిన్ని జాగ్రదవస్థ పొందిన వెనకకూడా స్వప్న సంభావితాలను జ్ఞాపకమునకు తెచ్చుకొని అవి సత్యములని కొంతసేపు భ్రమసి కొంచము దు, ఖించడము స్వానుభవముచేత నాకు తెలిశి వున్నది గనుక బుద్ధిచేత యేలబడని మనసుకు దు, ఖనివృత్యర్ధమున్ను యధోచితము బ్రహ్మానందవతుగా తాగడానకు మొదలు పెట్టినారనిన్ని అది పరంపరగా యెక్కువ అయి అనేకులు యీశ్వరుడు తమకు యిచ్చిన యథోచితమైన ప్రజ్ఞనుకూడా తాము పొగొట్టుకునేటట్టు పానాపేక్ష కలగడమయినది.

ఇంతదేశము తిరగడమువల్ల స్త్రీ పురుషులకు పరస్పర స్నేహమున్ను కలియకయున్ను మోహమున్ను ఆసక్తులున్ను పుట్టను కారణమేమని విచారించగా యిదిన్ని ఆహారములు, ఆచారములు, అలంకారములు వీటియెడల రుచిపుట్టేలగే గాని, యుక్కువలేదని తోచబడుచున్నది. అది యెందువల్లనంటే వొకదేశపు పురుషుణ్ని మరివొక దేశపు స్త్రీ చూస్తే ఆ పురుషుడి రూపాలుకారములు బాగా వున్నా హేయముగా చూచి అపహాస్యము కిందికి తెచ్చి అసహ్యబడుచున్నది. స్వదేశస్థుణ్ని చూచినంతలో వొక విధమైన యిష్టము హృదయములో అకస్మాత్తుగా జనించి కలియక ఆపేక్ష కలిగిన వెర్రి వాలుచూపులు కులుకులు అనే దేహకంపము - యిది మొదలయిన చేష్టలు స్త్రీలకు పుట్టి మర్మమైన అవయవములు దాచి మూసే లాంచనలతో తమ అవయవములకు ఆ స్వ దేశపురుషులకు నిరూపిస్తూ వుంటారు. తత్రాసి స్వదేశస్థులలోను స్వకీయులనున్ను, అత్యాసన్నులనున్ను స్త్రీలు చూచిన పక్షమందు పైన వ్రాశిన చేష్టలు దశగుణముగా అధికమవుచున్నది. యీ హేతువులవల్లనే పూర్వీకులు వివాహవిషయమై స్వకియ్యులలో సమీప రక్తస్పర్శ కలస్థలములలోకన్యాదానాలు కన్యాప్రతిగ్రహము నిషేధించి నిర్ణయించినట్టు తోచుచున్నది. ఆ నిశ్చయానుసారముగానే పరస్పరవాంచలున్ను వుదయింపుచున్నవి. గాని యీ వాంఛలున్ను వుదయింపుచున్నవి. గాని యీవాంఛలకు ఆచారాలకారాలవలెనే వాడికె మీద పుట్టే మనసు కారణమేగాని మరివొకకారణము వేరే వున్నట్టు తోచలేదు. యిందుకు శిష్టవాక్యము యింగిలీషువారిలో యూజ్ రిక్రిసయిల్స్ వుయిత్ ఎవ్వది ధింజ్ అని వున్నది. దీనికి తాత్పర్యము యేమంటే పరిచయము అన్నిటితోనున్ను అనుకూలింపచేయుచున్నది అని అర్ధము. పంతొమ్మిది తేది అంతా యీవూళ్ళో నిలిచినాను.

తేదివుదయాన నాలుగున్నరగంటలకు బయిలువెళ్ళి యిక్కడికి మూడుకోసుల దూరములో వుండే పిఠాపురమనే పుణ్యస్థలము యేడు గంటలకు చేరినాను. యీవూరు పూర్వము గయాసుర రాజధానిగా వుండినది. యీ స్థలమును పాదగయ యని అనుచున్నారు. యిక్కడ వొక తటాక మున్నది. దాన్ని పాదగయతీర్ధ మనుచున్నారు. యీ తటాకములో గయాసురుని పాదములు వున్నవని ప్రసీద్ధిగనుక యిక్కడ శ్రాద్ధముచేశి పిండప్రదానము చేయవలసినది. తీర్ధ్యమువొడ్డున వొక చిన్న శివాలయమున్నది. అందులోని లింగముపేరు కుక్కుటేశ్వరుడని అనుచున్నారు. యీవూళ్ళో వొకపాడుకూపములో అష్ఠాదశపీఠములతో చేరిన పురుహూత యనే శక్తి అదృశ్యముగా వసింపుచున్నదట. ఆపెకు ఉత్సవాలు యేమిన్ని నడవడము లేదు.

యీ వూళ్ళో యిన్నూరు బ్రాహ్మణయిండ్లు కలవు. వారందరు తీర్ధవాసులుగా యాచకవృత్తిని వహించియున్నారు. యీదేశములో గంజాము మొదలుగా భూరూపకమయిన జీవనము లేని బ్రాహ్మణుడు లేడు. యీ దినము తొలిఏకాదశి. దీన్ని సమస్తమయిన వారు యీ ప్రాంతములో గొప్ప పండగగా జరిగింపుచున్నారు. గయాపాద తీర్ధమువొడ్దున నేను డేరాలువేశి దిగి యిక్కడికి గుడిలోపల వంట, భోజనములు కాచేసుకున్నందున గయాతీర్ధములో స్నాననిమిత్తమై వచ్చిన వూరి స్త్రీలను బాలుల సమేతముగా అందరినిన్ని దర్శనము చేయడమయినది.

యీ వూళ్ళో పోలీసుదారోగా సహితముగా జమెందారులు నీలాద్రిరాయనింగారి కుటుంబస్థులు వొక మట్టికోటకట్టుకొని అందులో వసింపుచున్నారు. యీవూరు గొప్పబస్తీ. సమస్తపదార్ధాలు దొరుకును. సురాకార మనే పెట్లప్పు యిక్కడ పైరౌచున్నది. వూరుతోపులతోను తటాకాలతోను నిండి విశాలమైన వీధులు కలిగివున్నది. నేడు తెల్లవారి నదిచిన దారి కొంతమేర అడుసు నీళ్ళుగాని మిగిలిన భాట యిసకపరగానున్నది. జగన్నాధము మొదలుగా యిసకపరభూమి గనుక తాటిచెట్లు, మొగిలిచెట్లు, జెముడు, యివి మొదలయినవి విస్తరించిల్వున్నవి. యిండ్లకు తాటాకులు కప్పి పయిన కసువు పరుస్తారు. యీవూరి బ్రాహ్మణులు విచ్చలవిడిగా తారతమ్యాలు తెలియక నటింఛేవారు. పదిరూపాయలు భూరి పంచిపెట్టినంతలో యధోచితముగా సంతోషించిరి.

యిక్కడనుంచి రెండుగంటలకు బయిలువెళ్ళి నాలుగు కోసులదూరములొనుండే పెద్దాపురము ఆరు గంటలకు చేరినాను. యీ మధ్యాహ్నము నడిచిన దోవ పల్లపు పారు గనుకనున్ను భూమి రేగడ గనుకనున్ను యీదినము వర్షము కురిశినందుననున్ను అడుసునీళ్ళుగా వుండినందున చాలా జారుచూ వచ్చినది. యీ నడమ యేలా అనే వొక చిన్ననది కాలినడకగా దాటినాము. ఈ నది చిన్నదయినా మిక్కిలి తీక్ష్ణమయిన వేసంగికాలములయందున్ను, అనావృష్టి దోషాలు కలిగినప్పుడున్ను వొక్కరీతిని మిట్టను ప్రవహింపుచున్నది. పిఠాపురము పెద్దాపురము జమానుదారులు తాలుకాలవారు వంతుల ప్రకారము యేటి నీళ్ళు అడ్డకట్టి తమ గ్రామాదులకు తెచ్చుకోవడము చేత వీరి తాలూకాలలో యెల్లప్పుడు పంటలు సమృద్ధిగా గలిగియున్నవి.

పెద్దపురమనే వూరు పిఠాపురముకన్నా గొప్పది. యీ వూరి యిండ్లున్ను గొప్పలుగానే కట్టియున్నారు. వంద బ్రాహ్మణుల యిండ్లు కలవు. యిక్కడ పోలీసుదారోగా సహితముగా యిక్కడి జమీందారుడు వసింపుచు నుంటాడు. యితని తాలూకా మూడు లక్షలది. అంగళ్ళు కలవు. సమస్తపదార్ధాలు దొరుకు చున్నవి. యీ వూళ్ళో మూడు సంవత్సరములుగా యీ జమీందారుని భార్య అమ్మన్న అనే పురుషుని గొప్పయిల్లు స్వాధీనము చేసుకుని వొక అన్నసత్రము వేసియున్నది. ఆ స్థలము విశాలముగా వున్నందున అందులోనే యీ రాత్రి వసించినాను.

తేదీ వుదయాత్పూర్వము రెండు పాయింట్ నాలుగు గంతలకు లేచి యిక్కదికి రెండు ఆమడ దూరములోనుండే రాజానగర మనే వూరు పది గంటలకు ప్రవెశించినాను. దారి ఇసక కలిసిన రేగడ. కొంచపాటి యడివిన్ని, వొక కొండ తిరుగుడున్ను బహు చోరభయమున్ను కలిగి నడవ సమకూలమై వున్నది. యిక్కడ గోపాలరాజుల పితూరి అనే పేరుగల బందిపోట్లు ప్రతివూర కలిగివున్నది. నేను తుని యనే వూరివద్ద వదిలిన అయళ దారి రాజానగరము ముందు వచ్చి కలిసింది. రాజానగరము జలవసతి కల వూరు. అంగళ్ళు కలవు. పోలీసు అమీనా వసిస్తూ వుంటాడు. అన్ని పదార్ధములు దొరుకును. యీ వూరు కొచ్చలకాకోట వెంకటరాయుడి జమీను. యిక్కడ లోగడ రాజాబహదరు వారి అన్నసత్రము వుండి నిలిచిపోయినంతలో యీ జమీందారుడు. ఆ సత్రాన్ని వుద్ధరించి మళ్ళీ జరిగింపుచున్నాడు. యీ సత్రములో వంటబోజనముల నిమిత్తముదిగినాను. సత్రము బహువిశాలముగా కట్టివున్నది. యీవూరికి సమీపమందే నలభై యిండ్ల బ్రాహ్మణాగ్రహారము వొకటి వున్నది.

పాదగయలో నేను తీర్ధము వొడ్డున డేరాలలో దిగివుండగా గొప్పవర్షము కురిశినది. అప్పట్లో స్నాననిమిత్తమున్ను శివాలయదర్శననిమిత్తమున్ను వచ్చిన స్త్రీలు వర్షమును లక్ష్యపెట్టక స్నానపానములు స్వామిదర్శనాలు తడుస్తూచేసిన వేడుక చూడముచ్చటనున్ను విజయనగరములోను పట్నాఅనే షహరులోను గొప్పవారి యిండ్ల స్త్రీలకు అత్యంత దేహోపద్రవాలు కలిగి నేను ఔధముయిచ్చి పధ్యము తీసుకొమ్మన్నంతలో చచ్చినా మంచిదిగాని స్నానము లేక మేము వంటచేసుఖోక అన్నము పుచ్చుకొనమని వొకపట్టుగా మూర్ఖముచేసిన నిశ్చయముచూడగానున్ను కలిసాధుస్త్రీయస్సధు యనే సామాన్యవచనము బాగానేవున్నట్టు తోచుచున్నది.

యిక్కడనుంచి రెండుగంటలకు బయిలువెళ్ళి యిక్కడికి నాలుగు కోసుల దూరములోనుండే రాజమహేంద్రవరము మూడు గంటలకు చేరినాము. దారి కిరుపక్కలా అడివికలిగి యిసుకపరగావున్నది. రాజానగర రాజమహేంద్రవరాలకు చేరిసగాన పోలీసుఠాణాను పాంధుల క్షేమముకై కలకటరు వుంచివున్నాడు. యీ రాజమహేంద్రవరము పూర్వము రాజరాజనరేంద్రుని రాజధాని. అతని కొడుకు సారంగధరునితో చంద్రవంశము అంత్యమయిన దని లోకప్రసిద్ధి.

యీ రాజమహేంద్రవరము గౌతమమహాముని ఆశ్రమము పూర్వకాలమందు ద్వాదశర్షక్షామము సంభవించి సమస్త బ్ర్రాహ్మణ్యము అన్నములేక మనుష్యకోటికి గురువులయిన గౌతమలవద్దికి వచ్చి మొరపెట్టుకుంటే వారు తన తపోబలముచేత బ్రత్యహము కొద్దిగా వరిబీజాలు చల్లి అవి సద్య, ఫలమునకు వచ్చేటట్టుచేసి ఆధాన్యము అక్షయ మౌటచేత అనేకకోటి బ్రాహ్మణ్యమునకు ప్రత్యహము అన్నము యిచ్చి వారల ప్రాణరక్షణ చేసినారు. పిమ్మట క్షామము వదలగానే సమస్త ద్విజులు గౌతముల ఆశ్రమము వదిలి పొయ్యేటప్పుడు యంత యశస్సు గౌతములకు రావచ్చునా అని అసూయచేత, పాంఛంభౌతిక దేహములన్ని యీశ్వరుని మాయా సంబంధమయిన అరిషడ్వర్గముతో బద్ధము లయివున్నవి గనుకనున్ను ఉయిక్కడి జిల్లాజడ్జియయిన వైబరుటుదొర, చెక్కుముక్కి రాయిపై యినుము వేగముగాకొట్టి అగ్ని పడకపోతే తుపాకీలోని మందుగుండు బయిలుపడదు అన్నవతుగా యీ ప్రపంచము కృతజ్ఞత సాత్వికత్వౌలతో నిండితే అన్ని ప్రకృతులు చప్పుడు లేక స్థావరములుగా నిద్రపోతూ వుండవలశినవి గనుకనున్ను దురత్యయమయిన మాయ కష్నతి కష్నతి కష్న త్యేన అనే వచనప్రకారము పండితులను కూడా మోసపరచి చీకటిలో కండ్లు కలవాడు కండ్లు లేనివాడున్ను సమ మయినట్టు మనుష్యులను కృతఘ్నులను చేయుచున్నది గనుక అదేప్ర్కారము అప్పట్లో గౌతముల ఆశ్రమములో నున్న బ్రాహ్మణులు కుతంత్రమువల్ల ల్వొక గోవును కల్పించి గౌరములు ఆ దినము చల్లిన పయిరు మే శేటట్టు చేసినారు. ఆ గోవు ఆ ప్రకారము తాను చల్లిన పయిరు మేశేకృత్యము చూచి గౌతములు బ్రాహ్మలమీది భక్తిచేత గరికపోచను గొవుమీద వేశి అదలించినాడు. అంతమాత్రానికే ఆ గోవు చచ్చినట్టు అభినయించినది. వెంబడిగానే అక్కడవున్న బ్రాహ్మలు గౌరములను హత్యదోషము కలవాణ్నిగా నిందించినారు. గౌతములు పశ్చాత్తప్తలయి నాకు యేమి గతి యని బ్రాహ్మణమందలిని అడగగా శివుని జటాజూటములో వుండే విష్ణుపాదప్రసూతయయిన గంగను బయిటికి తెచ్చి అందులో అవగాహనము చేస్తేనేగాని నీవు పుణ్యాత్ముడవు గావని చెప్పినారు. పిమ్మట గౌతములు తపస్సువల్ల సాంబమూర్తిని సంతోష పెట్టి వొక ధారను భూమిమీదికి తెచ్చి తన ఆశ్రమముదాకాతెచ్చి స్నానముచేసి యెప్పుడున్ను లోకాపకారముగా భూమిమీద ప్రవహింపుచు వుండేటట్టు చేసినాడు. ఆ ధారకు, గొదావరి అని నామకరణము చేయడమయినది. పిమ్మట సప్తఋషులు గౌతములను ప్రార్ధించి సెలవు పుచ్చుకుని యేడుధారలుగా గోదావరిని చీలదీసి తమ తమ ఆశ్రమాలకు తీసుకుని వెళ్ళీనారు గనుక యీ రాజమహేంద్రవరమునకు గోదావరి అఖండముగా వచ్చిధవళేశ్వరము మొదలుగా చీలి సప్తగోదావరులుగా అయినది. ఆ సప్తగోదావరీ తీరమందు వుండే భూములు గోదావరీ వుదకబలముచేత సమసస్యా ధులను అమోఘముగా ఫలింపచేయుచున్నవి. ఆ సప్తగోదావరీ తీరమును కోనశీమ అనుచున్నారు. అక్కడ బ్రాహ్మలకు భూవసతులు చాలా వున్నవి.

యిది కాకినాడుజిల్లా యెనిమిదిలక్షల వరహాలు సాలుకు యెత్తు తన జమీన్ గ్రామాలమీదుగా తానుకూడా వచ్చి యెనిమిదామడపత్యంతము నన్ను సాగనంపించవలె నని తలచి ప్రార్ధించినాను గనుక దండుల్దారిని యేలూరిమీదుగా నా రెండుబండ్లను రవానాచేసి నేను అడ్డదారినివుండే వాడపల్లి రాత్రి ఏడు గంటలకు ప్రవేశించినాను. దారి గోదావరి వొడ్డుననే వొక మనిషి నడిచేపాటి కాలిదారిగా వున్నది. రాజమహేంద్రవరమునకు వాడపల్లె అనేవూరు ఆరు కోసుల దూరము. గోదావరి మధ్యే కొన్ని లంకలు ప్రవాహపు వేగాన పెట్టబడుచువచ్చుచున్నవి. వాడపల్లి యనే వూరు విష్ణుస్థలము గనుక వెంకటేశ్వరుల గుడి చిన్నదిగా వొకటి వున్నది. యిరువై యిండ్ల వైష్ణవాగ్రహారముకూడా కలదు. రాజా కొచ్చర్లకోట వెంకటరాయనింగారి తమ్ముడు యీ వాడపల్లెలో విశాలమయిన నగరు కట్టివున్నాడు. యీ రాత్రిన్ని మరునాడున్ను యిక్కడ వుండినాను. యీవూరు గోదావరి వొడ్డు గనుక యీవూళ్ళో బావులులేవు.
